Thunderstorm: వానలు మామూలే.. ఒకే చోట ఒకే రకం మేఘం తరచూ వర్షిస్తే.. ‘హెక్టర్’ మేఘం విశేషాలు ఇదిగో!
- ఏటా సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఒకే రోజు చిన్నపాటి తుపాను
- అది కూడా రోజూ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో.. అతి ఎత్తుగా ఏర్పాటవడం మరో ప్రత్యేకత
- టివి ద్వీపం పరిసర ప్రాంతాల వాతావరణ పరిస్థితులే కారణమంటున్న నిపుణులు
ఆకాశం మేఘావృతం కావడం, వానలు పడటం సహజమే.. కానీ ఒకే రకం మేఘం.. ఒకే చోట తరచూ ముసురుకుంటే.. అదీ ఉరుములతో కూడిన భారీ మేఘం ఏర్పడి, వాన పడుతుంటే.. అది చిత్రమే కదా. ఉత్తర ఆస్ట్రేలియాలోని టివి ద్వీపాల్లో ఇలాంటి ప్రత్యేక ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతిరోజూ ఓ ప్రత్యేకమైన చిన్నపాటి తుపాను వంటి భారీ మేఘం కమ్ముకుంటుంది. అది కూడా రోజూ మధ్యాహ్నం మూడు గంటల సమయంలోనే ఏర్పడుతుంది. ఒక్కోసారి ఎక్కువగా, మరోసారి తక్కువగా వర్షం కురిపించి మాయమైపోతుంది. కొన్ని వందల ఏళ్లుగా ఇలాగే జరుగుతోందని.. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏకంగా 20 కిలోమీటర్ల ఎత్తుతో..
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నావికులు, విమాన పైలట్లు హెక్టర్ మేఘాన్ని నావిగేషన్ కోసం వినియోగించుకునేవారట. ఆ మేఘం ఆధారంగా దిక్కులను, మార్గాన్ని నిర్ధారించుకునేవారని చెబుతారు. ఈ క్రమంలోనే ఈ మేఘానికి ‘హెక్టర్ ది కన్వెక్టర్’ అని పేరు పెట్టారు. దానినే ఇప్పటికి హెక్టర్ గా పిలుచుకుంటున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. హెక్టర్ మేఘం ఏకంగా 20 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడుతుంది. చుట్టూ 100 కిలోమీటర్లకుపైగా దూరం స్పష్టంగా కనిపిస్తుంది. సముద్రంలో అయితే మరింత ఎక్కువ దూరం కనిపిస్తుంది. అందుకే విమాన పైలట్లు, నావికులు దీనిని నావిగేషన్ గా వాడుకునేవారు.
ద్వీపం, దాని చుట్టూ వాతావరణ పరిస్థితులతోనే..
- మన నైరుతి రుతు పవనాల తరహాలో ఆస్ట్రేలియా ప్రాంతంలో వీచే ఆగ్నేయ పవనాలతోపాటు తివి ద్వీపాలు ఉన్న ప్రాంతం, అక్కడి భూమి ఎత్తు, ఇతర అంశాల కారణంగా మేఘం ఏర్పడే పరిస్థితి ఉంటుందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ అధికారి ఇయాన్ షెపర్డ్ తెలిపారు.
- రోజూ పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు కాసే ఎండ వల్ల చుట్టూ ఉన్న సముద్రంలోని నీరు ఆవిరి అవడం, దానికి ద్వీపాలపై వేడి తోడవడం.. ఆగ్నేయం నుంచి వీచే తేమతో కూడిన గాలి కూడా కలవడంతో హెక్టర్ మేఘం ఏర్పడుతుందని వివరించారు.
- అందుకే పొద్దంతా వేడిని గ్రహించి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మేఘం ఏర్పడుతుందని తెలిపారు. అందుకే టివి ద్వీపాల్లో ఎండాకాలం, వానాకాలం ఉండే సెప్టెంబర్ నుంచి మార్చి వరకు రోజూ హెక్టర్ మేఘం ఏర్పడుతుందని వెల్లడించారు. ఇది క్యుములో నింబస్ తరహా మేఘమని.. అప్పటికప్పుడు అతి తీవ్రతతో, అత్యంత ఎత్తుతో, భారీగా ఏర్పడుతుందని వివరించారు.
- చలికాలంలో ఎండ వేడి, గాలిలో తేమ తక్కువగా ఉండటం వల్ల మేఘాలు ఏర్పడే పరిస్థితి ఉండదని.. అయినా అప్పుడప్పుడే హెక్టర్ ఏర్పడుతుందని వెల్లడించారు.