Team India: చివరి వన్డేలోనూ టీమిండియాదే విజయం... జింబాబ్వేపై సిరీస్ క్లీన్ స్వీప్
- హరారేలో మూడో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు
- శుభ్ మాన్ గిల్ సెంచరీ
- లక్ష్యఛేదనలో 276 పరుగులకు జింబాబ్వే ఆలౌట్
- సికిందర్ రజా సెంచరీ వృథా
పసికూన జట్టు జింబాబ్వేపై 3 వన్డేల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా 13 పరుగుల తేడాతో నెగ్గింది. 290 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ ఆటగాడు సికిందర్ రజా (115) సెంచరీ చేయడంతో ఓ దశలో జింబాబ్వే విజయానికి చేరువగా వచ్చింది.
అయితే రజా అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. టీమిండియా బౌలర్లలో అవేష్ ఖాన్ 3, దీపక్ చహర్ 2, కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ 2, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. జింబాబ్వే ఇన్నింగ్స్ లో షాన్ విలియమ్స్ 45, బ్రాడ్ ఇవాన్స్ 28 పరుగులు చేశారు.
అంతకుముందు, టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వన్ డౌన్ లో వచ్చిన శుభ్ మాన్ గిల్ (130) అద్భుతంగా ఆడి సెంచరీ చేయడం విశేషం. గిల్ సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గిల్ కే దక్కింది.