Wasim Akram: కోహ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నా... అయితే అది పాకిస్థాన్ తో మ్యాచ్ కాకూడదు: వసీం అక్రమ్
- ఇటీవల దారుణంగా ఆడుతున్న కోహ్లీ
- 2019 తర్వాత ఒక్క సెంచరీ కూడా సాధించని వైనం
- కోహ్లీపై తీవ్ర విమర్శలు.. బాసటగా నిలిచిన అక్రమ్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేకపోవడం ఇప్పటికీ విమర్శలకు తావిస్తోంది. దీనిపై పాకిస్థాన్ పేస్ దిగ్గజం వసీం అక్రమ్ స్పందించాడు. గత ఏడాదిగా చూస్తున్నానని, భారత్ ఫ్యాన్స్ తో పాటు, మీడియా కూడా కోహ్లీపై ఏదో ఒకటి అనవసరంగా మాట్లాడడం అలవాటైపోయిందని తెలిపాడు. కోహ్లీ వయసు కేవలం 33 ఏళ్లేనని, ఆధునిక తరం అత్యుత్తమ క్రికెటర్లలో కోహ్లీ ఒకడని పేర్కొన్నాడు.
అన్ని ఫార్మాట్లలో కోహ్లీ సగటు 50 అని, ఇప్పటికీ ఫిట్ గానే ఉన్నాడని అక్రమ్ వెల్లడించాడు. ఫాం అనేది తాత్కాలికమని, క్లాస్ ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ గొప్ప ఆటగాడు అనడంలో సందేహంలేదని, తప్పకుండా ఫాంలోకి వస్తాడని, అయితే అది పాకిస్థాన్ తో మ్యాచ్ కాకూడదని కోరుకుంటున్నానని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.