Andhra Pradesh: ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో భారీ ఊరట
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన అనంతబాబు
- 2 రోజుల క్రితం చనిపోయిన అనంతబాబు తల్లి
- తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనంతబాబుకు 3 రోజుల బెయిల్ ఇచ్చిన రాజమండ్రి కోర్టు
- రాజమండ్రి కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన ఎమ్మెల్సీ
- అదనంగా 11 రోజుల పాటు అనంతబాబుకు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైసీసీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకు వరుసగా రెండో రోజైన మంగళవారం భారీ ఊరట లభించింది. అరెస్టయిన నాటి నుంచి బెయిల్ కోసం అనంతబాబు చేసిన యత్నాలన్నీ విఫలమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో అనంతబాబు తల్లి మరణించారు. తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ అనంతబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ చేపట్టిన రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆయనకు 3 రోజుల పాటు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది.
అయితే రాజమండ్రి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తనకు మరిన్ని రోజుల పాటు బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు మంగళవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు అనంతబాబుకు సెప్టెంబర్ 5 దాకా మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో రాజమండ్రి కోర్టు ఇచ్చిన 3 రోజుల బెయిల్‌కు అదనంగా 11 రోజుల పాటు బెయిల్ లభించినట్టయింది.