Telangana: తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్‌లో భర్తీ అయిన ఇంజినీరింగ్ సీట్ల వివరాలివే
- రాష్ట్రంలో కొత్తగా 14 కళాశాలలకు హైకోర్టు అనుమతి
- ఫీజులు నిర్ణయించకుండానే కౌన్సిలింగ్ ఎలా అన్న కళాశాలలు
- ఇప్పటిదాకా కన్వీనర్ కోటాలో 65,633 సీట్ల భర్తీ
తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ఆధారంగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఇటీవలే కౌన్సిలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. మంగళవారం నాటికి కౌన్సిలింగ్‌లో కన్వీనర్ కోటా కింద ఉన్న సీట్లలో 65,633 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో సీఎస్ఈలో 17,154 సీట్లు, ఈసీఈలో 11,375 సీట్లు ఉన్నాయి. మిగిలిన సీట్లు వివిధ విభాగాలకు చెందినవిగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే... ఈ ఏడాది కొత్తగా 14 కళాశాలలు ఇంజినీరింగ్ విద్యను బోధించేందుకు హైకోర్టు అనుమతించింది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకే ఫీజులు వసూలు చేస్తామంటూ ఈ విద్యా సంస్థలు చెప్పడంతో హైకోర్టు వాటికి అనుమతి ఇచ్చింది. మరోవైపు ఆయా కళాశాలల్లో ఏ మేర ఫీజులు వసూలు చేయాలన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండానే కౌన్సిలింగ్ ప్రారంభించిందని పలు కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.