Amitabh Bachchan: మళ్లీ కరోనా బారినపడిన అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan tests Covid positive for the second time
  • గత రాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అమితాబ్
  • తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
  • రెండేళ్ల క్రితం కూడా కరోనా బారినపడి కోలుకున్న బిగ్ బీ
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన గత రాత్రి ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘బిగ్ బీ’కి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. 

అమితాబ్ ప్రస్తుతం  ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ 14వ సీజన్ షూటింగులో ఉన్నారు. అలాగే, కీలక పాత్రలో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే, ‘గుడ్‌బై’, ‘ఊంచాయి’ సినిమాల్లోనూ నటిస్తున్నారు. రష్మిక మందన్నతో కలిసి మరో సినిమాలో కనిపించబోతున్నారు. కరోనా బారినపడిన అమితాబ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

అమితాబ్ కరోనా బారినపడడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం కరోనా సోకినప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని కోలుకున్నారు. అలాగే, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కొవిడ్ బారినపడి కోలుకున్నారు.
Amitabh Bachchan
COVID19
Bollywood

More Telugu News