Chandrababu: చంద్రబాబు టూర్లో ఉద్రిక్తత... పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు
- రామకుప్పం మండలంలో పర్యటిస్తున్న చంద్రబాబు
- కొల్లుపల్లెలో వైసీపీ జెండాలు కట్టిన ఆ పార్టీ నేతలు
- జెండాలను తొలగిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి
- దాడిలో ఓ ఎస్సై సహా పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు
- కుప్పంలో వైసీపీ నేతల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు వార్నింగ్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఓ ఎస్సైతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మరిన్ని బలగాలను అక్కడికి పంపి... ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.
3 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం మధ్యాహ్నం కుప్పం పరిధిలోని రామకుప్పం మండలానికి చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ వైపు చంద్రబాబు టూర్ కొనసాగుతుండగానే... మండలంలోని కొల్లుపల్లెలో చంద్రబాబు వచ్చే మార్గంలో వైసీపీ శ్రేణులు జెండాలను కట్టాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు ఆ జెండాలను తొలగించే యత్నం చేయగా...వారిపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగినట్లు సమాచారం. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు... వైసీపీ శ్రేణులను ఓ ఇంటిలో నిర్బంధించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఈ ఘర్షణపై స్పందించిన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం నా నియోజకవర్గం అని గుర్తు పెట్టుకోండి అంటూ వైసీపీ శ్రేణులకు హెచ్చరికలు జారీ చేశారు. కుప్పంలో అతిగా ప్రవర్తిస్తే వైసీపీ నేతల తోకలు కట్ చేస్తానంటూ ఆయన చురకలు అంటించారు. తన పర్యటనలో వైసీపీ జెండాలు కట్టడమేమిటని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇది ప్రత్యర్థి వర్గాన్ని ఉసికొల్పడం కాదా? అని ప్రశ్నించారు.