Delhi High Court: యుక్తవయస్సు వచ్చిన ముస్లిం బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకోవచ్చు: ఢిల్లీ హైకోర్టు
- బీహార్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ముస్లిం జంట
- బంధువు నుంచి ముప్పు ఉందంటూ కోర్టును ఆశ్రయించిన అమ్మాయి
- పెళ్లయిన జంటను ఎవరూ విడదీయలేరన్న కోర్టు
- వారికి రక్షణ కల్పించాలంటూ ఆదేశాలు
ఓ పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లీడు వచ్చిన ముస్లిం బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే వివాహం చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. బీహార్ లో ఓ ముస్లిం జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ మత సంప్రదాయాలను అనుసరించే వారు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. అయితే తన తరఫు బంధువు నుంచి ముప్పు ఉందంటూ ఆ అమ్మాయి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా జస్టిస్ జస్మీత్ సింగ్ ధర్మాసనం స్పందిస్తూ... చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న జంటను ఒకరి నుంచి మరొకరిని వేరుచేయలేరని స్పష్టం చేసింది. కలిసి ఉండడమే పెళ్లి యొక్క పరమార్థం అని పేర్కొంది. భార్యాభర్తల బంధంలోకి చొరబడి, వారిని విడదీసే హక్కు ప్రభుత్వానికి కూడా లేదని ఉద్ఘాటించింది.
"మహమ్మదీయుల చట్టం ప్రకారం, ఓ అమ్మాయికి యుక్తవయసు వస్తే తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకోవచ్చన్నది సుస్పష్టం. 18 ఏళ్ల లోపు వయసున్నప్పటికీ భర్తతో కలిసి నివసించే హక్కు ఆమెకు ఉంటుంది" అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో, బీహార్ ముస్లిం జంటకు రక్షణ కల్పించాలంటూ అధికారులను ఆదేశించింది.
పిటిషన్ దాఖలు చేసిన ముస్లిం అమ్మాయి ప్రస్తుతం గర్భవతి అని, ఈ దశలో ఆమెను భర్త నుంచి విడదీస్తే, ఆమెకు, ఆమెకు పుట్టబోయే బిడ్డకు కూడా మరింత సమస్యాత్మకం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. పెళ్లి చేసుకునే సమయానికి 15 ఏళ్ల వయసున్న ఆ బాలికను తల్లిదండ్రులు ప్రతిరోజూ కొట్టేవారని, మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసేవారని కోర్టు పేర్కొంది.