England: సముద్ర గర్భంలో ఆగిపోయిన ఫ్రాన్స్-యూకే రైలు.. అండర్‌సీ టన్నెల్‌లో 5 గంటలపాటు ప్రయాణికుల నరకయాతన
- ఫ్రాన్స్‌లోని కలైస్ నుంచి ఇంగ్లండ్‌లోని ఫోల్కెస్టోన్ వెళ్తున్న రైలు
- ఇంగ్లిష్ చానల్ గుండా ప్రయాణిస్తుండగా ఘటన
- అలారంలు మోగడంతో ఆగిపోయిన రైలు
- డిజాస్టర్ సినిమాను చూసిన అనుభూతి కలిగిందన్న ప్రయాణికులు
సముద్ర గర్భం గుండా ప్రయాణిస్తున్న రైలు మధ్యలో ఐదారు గంటలు అకస్మాత్తుగా ఆగిపోతే.. వామ్మో! వినడానికే భయంకరంగా ఉంది. మరి ఆ పరిస్థితిని అనుభవించిన వారి మాటేమిటి? ఫ్రాన్స్‌లోని కలైస్ నుంచి ఇంగ్లండ్‌లోని ఫోల్కెస్టోన్ వెళ్తున్న రైలు ఇంగ్లిష్ చానల్ కింద ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో? మళ్లీ ఎప్పుడు కదులుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దాదాపు ఐదారు గంటలపాటు ఉగ్గబట్టుకుని కూర్చున్నారు. చివరికి అత్యవసర సేవల ద్వారా వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం మరో ట్రైన్ ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చారు. మంగళవారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ఘటన జరిగింది.
యూరోటన్నెల్ లే షటిల్ సర్వీస్ రైలు అలారంలు ఒక్కసారిగా ఆఫ్ అవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బుధవారం ఉదయానికి తిరిగి సేవలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు అధికారి ఒకరు తెలిపారు. రైలు అలారంలు మోగడం కారణంగా రైలు నిలిచిపోయిందని, దీనిపై దర్యాప్తు అవసరమని అన్నారు. ఇది చాలా అసాధారణమైన ఘటన అని అభివర్ణించారు. ఆ తర్వాత రైలును సొరంగం నుంచి నెమ్మదిగా బయటకు తీసుకొచ్చినట్టు చెప్పారు.
అండర్‌సీ టన్నెల్‌లో రైలు చిక్కుకుపోవడంపై బర్మింగ్‌హామ్‌కు చెందిన 37 ఏళ్ల సారా ఫెలోస్ మాట్లాడుతూ.. ఇదో భయంకరమైన అనుభవమని చెప్పారు. ఇదో డిజాస్టర్ సినిమాలా అనిపించిందని, ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురైనట్టు చెప్పారు. సముద్రం కింద అందరం క్యూ కట్టాల్సి వచ్చిందని పేర్కొంది. మరికొందరు భయంతో కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇంకొందరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని సారా చెప్పుకొచ్చింది. అండర్‌సీ టన్నెల్‌లో ప్రయాణికులు చిక్కుకుపోయిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.