Vijay Devarakonda: మూవీ రివ్యూ: 'లైగర్'

Liger Movie Review

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'లైగర్' 
  • కొత్తగా అనిపించని కథాకథనాలు
  • ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ .. రమ్యకృష్ణ పాత్రలు
  • నాజూకుగా మెరిసిన అనన్య పాండే  
  • ప్రీ క్లైమాక్స్ నుంచి పట్టాలు తప్పిన కథ

పూరి జగన్నాథ్ ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి మాస్ ఇమేజ్ అనేది తన్నుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. చాక్లెట్ బాయ్ రామ్ ను మాస్ హీరోగా చూపించిన 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ కొట్టినవాడాయన. అలాంటి పూరి.. ఆల్రెడీ మాస్ ఫాలోయింగ్ మస్తుగా ఉన్న విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తే, ఆ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉండటం సహజం. అలా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'లైగర్' పాన్ ఇండియా స్థాయిలో ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకి వచ్చిన ఈ సినిమా, వారి అంచనాలను ఏ మేరకు అందుకుందన్నది చూద్దాం. 

 కరీంనగర్ ప్రాంతానికి చెందిన బాలామణి (రమ్యకృష్ణ) భర్త బలరామ్ బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్ షిప్ వరకూ వెళ్లి చనిపోతాడు. దాంతో తన కొడుకైన 'లైగర్' (విజయ్ దేవరకొండ)ను బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్ గా చూడాలని బాలామణి అనుకుంటుంది. రోడ్డు పక్కన చాయ్ బండి పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తూ, కొడుకులో పట్టుదల పెంచుతూ వెళుతుంది. తన కలను నిజం చేసుకోవడం కోసం కొడుకును వెంటబెట్టుకుని ముంబై వెళుతుంది. అక్కడ క్రిస్ట్ ఫర్ (రోనీత్ రాయ్) ను రిక్వెస్ట్ చేసి అతని ట్రైనింగ్ సెంటర్ లో చేరుస్తుంది.

లైగర్ కూడా తల్లి ఆశయాన్ని నిజం చేయాలనే ఆలోచనతోనే ఎదుగుతాడు. అతని ఆరాధ్య దైవం మైక్ టైసన్. ఆయన బొమ్మగల టీ షర్టునే వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఎప్పటికైనా ఆయనలా పేరు తెచ్చుకోవాలనీ.. ఆయనతో ఓ సెల్ఫీ దిగాలని కలలు కంటూ ఉంటాడు. లైగర్ లో ఆశయంతో పాటు ఆవేశం కూడా ఉందని మొదటి పరిచయంలోనే క్రిస్ట్ ఫర్ గమనిస్తాడు. కాకపోతే బాలామణి ఫ్లాష్ బ్యాక్ వినేసి లైగర్ ను చేర్చుకుంటాడు. క్రిస్ట్ ఫర్ చెప్పిన పనులు చేస్తూ .. అతని దగ్గర లైగర్ శిక్షణ తీసుకుంటూ ఉంటాడు. 

అక్కడే మరో ట్రైనింగ్ సెంటర్ ను సంజూ (విషు రెడ్డి) నడుపుతుంటాడు. ఈ రెండు ట్రైనింగ్ సెంటర్ల మధ్య వైరం నడుస్తుంటుంది. ఏదైనా సాధించాలనుకుంటే అమ్మాయిల పట్ల ఆకర్షణ .. ప్రేమలో పడటం వంటివి చేయకూడదని బాలామణితో పాటు ట్రైనర్ కూడా లైగర్ కి చెబుతారు. కానీ అతను సంజూ చెల్లెలు తాన్య (అనన్య పాండే) ప్రేమలో పడతాడు. లైగర్ కి 'నత్తి' ఉందని తెలిసిన తాన్య  అతణ్ణి అవమానించి .. ఆ రోజు నుంచి దూరమవుతుంది. అప్పుడు లైగర్ ఏం చేస్తాడు? తల్లి ఆశను .. ఆశయాన్ని అతను ఎంతవరకూ నెరవేరుస్తాడు? అనేది కథ. 

పూరి జగన్నాథ్ తయారు చేసుకునే కథలు .. ఆయన సినిమాల్లోని హీరోల క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. సింపుల్ లైన్ తీసుకుని తన మార్క్ తో ఇంట్రస్టింగ్ గా చెప్పడానికి ఆయన ట్రై చేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోను ఆయన అదే పద్ధతిని ఫాలో అయ్యాడు. కథలో .. కథనంలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. ఒక వైపున విజయ్ దేవరకొండ .. మరో వైపున రమ్యకృష్ణ ఈ రెండు పాత్రలే కళ్లుగా మారిపోయి ఈ కథను ముందుకు తీసుకుని వెళతాయి. ఈ రెండు పాత్రలను ఆయన మలిచిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది.

బాక్సింగ్ కథ గదా అని పూరి హీరోను .. కథను 'రింగ్'కి మాత్రమే పరిమితం చేయలేదు. ఆ రింగ్ దిశగా హీరో పాత్రను నడిపించిన తీరు .. శిక్షణ సమయంలో హీరోకి ఎదురైన సవాళ్లు .. అనన్యతో లవ్ .. అమ్మతో ఎమోషన్ .. గెటప్ శ్రీను కామెడీ .. అనన్య బ్రదర్ తో గొడవలు .. ఇలా నాన్ స్టాప్ ఎంటర్టయిన్మెంట్ తో ఇంటర్వెల్ ఇట్టే వచ్చేస్తుంది. 'లైగర్'కి హీరోయిన్ బ్రేకప్ చెప్పడమనే ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందా? అనే ఆత్రుతతో సెకండాఫ్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తుంటారు. 

సెకండాఫ్ ఆరంభంలోనే సంజూపై గెలిచి లైగర్ నేషనల్ ఛాంపియన్ అవుతాడు. దాంతో ఒక్కసారిగా ఆయన క్రేజ్ పెరిగిపోతుంది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలనేదే తన ఆశయమని మీడియా ముఖంగా లైగర్ చెబుతాడు. అందుకు అవసరమైన ఆర్ధిక సహాయం కూడా లభించడంతో లైగర్ టీమ్ లాస్ వేగాస్ చేరుకుంటుంది. ఇక్కడి నుంచే కథ అదుపు తప్పుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడటానికి ఎవరు హెల్ప్ చేస్తారా? అని లైగర్ టీమ్ టెన్షన్ పడుతుండగా, తాగిన మత్తులో అలీ ఎంట్రీ ఇచ్చి, అందుకు అవసరమైన ఏర్పాట్లు చకచకా చేసేస్తాడు. ఇక్కడి నుంచే కథలో సీరియస్ నెస్ పోతుంది. లాస్ వేగాస్ ఎపిసోడ్ లో అదే కంటిన్యూ అవుతుంది. 

ఇది బాక్సింగ్ నేపథ్యంలోని కథ గనుక, ఎలాగైనా మైక్ టైసన్ ను తెరపై చూపించాలనే పూరి ఆలోచన తేడా కొట్టేసింది. లైగర్ రింగ్ లో ఫైట్ చేస్తుంటే మైక్ టైసన్ తో క్లాప్స్ కొట్టించినా మంచి రెస్పాన్స్ వచ్చేది. కానీ ఆయనను ఒక ప్రత్యేకమైన పాత్రలో చూపించాలనే ఉద్దేశంతో పూరి డిజైన్ చేసుకున్న పాత్ర సెట్ కాలేదు. ఫలితంగా కథ పట్టు కోల్పోయి సిల్లీగా అనిపిస్తుంది. ఏడాది పాటు కష్టపడి మైక్ టైసన్ ను పట్టుకున్నట్టు పూరి చెప్పాడు. కానీ అది కథకి ప్లస్ కాకపోగా మైనస్ అయిందనే చెప్పాలి. 


విజయ్ దేవరకొండ యాక్షన్ ఈ సినిమాకి హైలైట్. '' ఏయ్ ఏందిదీ .. మీరింత ఫాస్టుంటే రేప్పొద్దున మీకు పెళ్లిళ్లు ఎట్లయితయే" అంటూ లేడీ ఫైటర్లతో తన మార్కు డైలాగులతో అతను మెప్పించాడు. నిజమైన బాక్సర్ లా తెరపై విజృంభించాడు. "ఆడు నా కొడుకు .. ఆడెవడి మాటా ఇనడు" అంటూ మాస్ మదర్ రోల్లో రమ్యకృష్ణ గొప్పగా చేసింది. ఆ తరువాత అనన్య పాండే.. విషు రెడ్డి పాత్రలను కూడా పూరి మలిచిన తీరు బాగుంది. అనన్య అందంగా మెరిసింది. నటనతోను .. డాన్సుల పరంగాను అలరించింది. విషు రెడ్డి యంగ్ విలన్ గా పనికొస్తాడు.

సంగీతం విషయానికి వస్తే రెండు పాటలు ట్యూన్ పరంగా కొత్తగా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జునైద్ సిద్ధికీ ఎడిటింగ్ నీట్ గా ఉంది. విష్ణు శర్మ కెమెరా పనితనానికి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. పాటలను .. ఫైట్లను తెరపై గొప్పగా ఆవిష్కరించాడు. కథాకథనాల్లో కొత్తదనం లేకపోయినా, ప్రధానమైన పాత్రలను పూరి మలిచిన విధానం .. వాటిని నడిపించిన తీరు బాగున్నాయి. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ట్రాక్ తప్పడంతో ప్రేక్షకుడు జారిపోతాడు. కథ సిల్లీగా క్లైమాక్స్ కు చేరుకుని .. అంతే సిల్లీగా ముగుస్తుంది. 

--- పెద్దింటి గోపీకృష్ణ

  • Loading...

More Telugu News