Telangana: బీజేపీకి భారీ ఊరట... బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ యాత్రను అడ్డుకున్న పోలీసులు
- ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు యాత్ర అన్న బీజేపీ
- యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
- పోలీసుల నోటీసులను కొట్టివేస్తూ యాత్రకు అనుమతి ఇచ్చిన కోర్టు
తెలంగాణలో బీజేపీకి గురువారం భారీ ఊరట లభించింది. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ సాగిస్తున్న పాదయాత్రను బుధవారం పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా బండి సంజయ్ ప్రసంగిస్తున్నారని ఆరోపించిన పోలీసులు... అవే ఆరోపణలతో కూడిన నోటీసులను అందించి సంజయ్ యాత్రను అడ్డకున్నారు.
ఈ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. బుధవారమే దాఖలు చేసిన తమ పిటిషన్‌ను లంచ్ మోషన్ పిటిషన్‌గా పరిగణించి అత్యవసరంగా విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసినా... అందుకు నిరాకరించిన హైకోర్టు గురువారం తొలుత మీ పిటిషన్‌పైనే విచారణ చేపడతామంటూ చెప్పింది.
ఇక నేడు ఈ పిటిషన్‌పై విచారణ సాగగా... పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు హాజరయ్యారు. బండి సంజయ్ ప్రసంగాలను ఆయన పెన్ డ్రైవ్ రూపంలో కోర్టుకు సమర్పించారు. వాటిని ఇతర రూపాల్లో సమర్పించాలని కోర్టు కోరింది. ఈ క్రమంలో విచారణలో కాస్తంత జాప్యం జరిగింది.
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తమ నేత యాత్ర చేస్తున్నారని బీజేపీ వాదించింది. ఇరు వర్గాల వాదనలు విన్నకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. యాత్రను నిలుపుదల చేస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. దీంతో శుక్రవారం నుంచే బండి సంజయ్ యాత్ర నిలిచిన చోటు నుంచే ప్రారంభం కానుంది. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారమే ఈ నెల 27కు వరంగల్ చేరుకునే యాత్ర అక్కడే ముగియనుంది.