Andhra Pradesh: కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో ఏపీ ప్రతినిధి బృందం 3 గంటల పాటు భేటీ... చర్చించిన అంశాలివే
- మోదీతో జగన్ భేటీ నేపథ్యంలో జరిగిన భేటీ
- బుగ్గన, సాయిరెడ్డి నేతృత్వంలో ఏపీ ప్రతినిధి బృందం
- పోలవరం, భోగాపురం ఎయిర్‌పోర్టు, తెలంగాణ బకాయిలను ప్రస్తావించిన వైనం
- అన్ని అంశాలకు సానుకూలంగా స్పందించారని సాయిరెడ్డి, బుగ్గన వెల్లడి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన నేపథ్యంలో ఏపీ విభజన చట్టం హామీల అమలు, రాష్ట్ర ఆర్థిక సమస్యల పరిష్కారంపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ ఏపీ ప్రతినిధి బృందంతో గురువారం చర్చలు జరిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన ఈ భేటీ సాయంత్రం 6 గంటల దాకా దాదాపుగా 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఏపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు పాలుపంచుకున్నారు.
భేటీ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన సాయిరెడ్డి, బుగ్గనలు మీడియాతో మాట్లాడారు. భేటీలో తమ ప్రతిపాదనలకు కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించిందని వారు తెలిపారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు ఎన్ఓసీ, తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,500 కోట్ల బకాయిలు తదితరాలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో చర్చించినట్లు తెలిపారు. ఈ అంశాలన్నింటికీ కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించిందని వారు తెలిపారు.