Irphan Pathan: విస్తారా ఎయిర్ లైన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్

Former Team India cricketer Irphan Pathan fires in Vistara Airlines
  • ముంబయి నుంచి దుబాయ్ వెళుతుండగా ఘటన
  • కన్ఫామ్ అయిన టికెట్ ను మార్చివేసిన ఎయిర్ లైన్స్
  • తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఇర్ఫాన్ పఠాన్
  • గ్రౌండ్ స్టాఫ్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ
టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ విస్తారా ఎయిర్ లైన్స్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముంబయి నుంచి దుబాయ్ వెళుతుండగా విస్తారా సిబ్బంది ప్రవర్తన చాలా దారుణంగా ఉందని ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించాడు. ఓ కౌంటర్ వద్ద భార్య, చిన్నపిల్లలతో కలిసి గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని, పైగా గ్రౌండ్ స్టాఫ్ ఎంతో దురుసుగా ప్రవర్తించారని వెల్లడించాడు. 

"ఇవాళ నేను ముంబయి నుంచి దుబాయ్ కి విస్తారా విమానం యూకే-201లో ప్రయాణిస్తున్నాను. అయితే చెక్ ఇన్ కౌంటర్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. అప్పటికే నాకు టికెట్ కన్ఫామ్ కాగా, నాకు తెలియకుండానే ఆ టికెట్ ను మార్చివేసి తక్కువ శ్రేణి టికెట్ కేటాయించారు. దీనిపై స్పష్టత కోసం కౌంటర్ వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాతో పాటు నా భార్య, 8 నెలల పసికందు, 5 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నారు. 

గ్రౌండ్ స్టాఫ్ ఎంతో తలబిరుసుగా మాట్లాడడమే కాకుండా, టికెట్ విషయంలో అనేక కారణాలు చెప్పారు. నాతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఈ విధంగా టికెట్లు అమ్ముకోవడం ఎందుకో అర్థంకావడంలేదు. దీన్ని విస్తారా మేనేజ్ మెంట్ ఎలా అనుమతిస్తోంది? దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఎదురైన అనుభవం మరెవ్వరికీ ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను" అంటూ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
Irphan Pathan
Vistara Airlines
Mumbai
Dubai
Airport
Team India
Cricket

More Telugu News