Komatireddy Raj Gopal Reddy: కేసీఆర్ లో భయం మొదలయింది.. ఇంటికి కిలో బంగారం ఇచ్చినా టీఆర్ఎస్ ఓటమి ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- మునుగోడు ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారన్న రాజగోపాల్
- మునుగోడు తీర్పుపై తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉందని వ్యాఖ్య
- టీఆర్ఎస్ ను ఓడించడం బీజేపీకే సాధ్యమని కామెంట్
కాళేశ్వరం ప్రాజెక్టుతో సంపాదించిన అవినీతి సొమ్ముతో మునుగోడు ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం కలిగిన వారని... కేసీఆర్ గిమ్మిక్కులకు వారు పడిపోరని అన్నారు.
ఇంటికి కిలో బంగారం పంచినా టీఆర్ఎస్ ను ఓడిస్తారని చెప్పారు. కేసీఆర్ లో ఓటమి భయం మొదలయిందని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టడానికి చేస్తున్న ధర్మయుద్ధంలో విజయం మునుగోడు ప్రజలదేనని చెప్పారు. మునుగోడు తీర్పుపై తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు.
మునుగోడులో నిర్వహించిన సభలో ఓటర్లను భయపెట్టే ప్రయత్నాన్ని కేసీఆర్ చేశారని కోమటిరెడ్డి విమర్శించారు. రైతులకు వ్యవసాయ మీటర్లు పెడతారని భయపెట్టి వెళ్లిపోయారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలన కేవలం గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటకే పరిమితమయిందని అన్నారు. మునుగోడుకు నిధులు ఇవ్వాలని తాను అసెంబ్లీ సాక్షిగా అడిగినా కేసీఆర్ ఇవ్వలేదని చెప్పారు. ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా ప్రజల కోసం పని చేయలేకపోతున్నాననే రాజీనామా చేశానని అన్నారు.
టీఆర్ఎస్ ను ఓడించడం బీజేపీకే సాధ్యమని... అందుకే బీజేపీలో చేరానని చెప్పారు. తన రాజీనామాతో మునుగోడులో సునామీ వచ్చిందని అన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమయిందని అన్నారు. మరోవైపు బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కు చెందిన చౌటుప్పల్ జెడ్పీటీసీ సభ్యుడు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, నలుగురు మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బీజేపీలో చేరారు.