Virat Kohli: 7+18 అంటూ ధోనీ కెప్టెన్సీలో ఆటపై కోహ్లీ ఆసక్తికర ట్వీట్
- మహీ హయాంలో అతనికి నమ్మకస్తుడిగా ఉన్న కాలాన్ని ఎంతో ఆస్వాదించానన్న విరాట్
- ధోనీ కెప్టెన్సీలో 2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కోహ్లీ
- 2014లో మహీ నుంచి టెస్టు కెప్టెన్సీ అందుకున్న విరాట్
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనీతో తన అనుబంధాన్ని, అతని కెప్టెన్సీలో ఆడిన కాలాన్ని గుర్తు చేసుకున్నాడు. 2008లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2014 వరకు ధోనీ నేతృత్వంలో ఆడాడు. ఆ ఏడాది ధోనీ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ తొలిసారి భారత సారథ్యం అందుకున్నాడు. ఆ తర్వాత వన్డే, టీ20 పగ్గాలు కూడా అందుకున్న విరాట్ టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ అయి పలు గుర్తుండిపోయే విజయాలు సొంతం చేసుకున్నాడు. మరోవైపు ధోనీ 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
ధోనీ నాయకత్వంలో ఆటను తాను ఎంతో ఆస్వాదించానని కోహ్లీ ట్వీట్ చేశాడు. ‘ఈ వ్యక్తి నమ్మకస్తుడిగా ఉండటం నా కెరీర్‌లో అత్యంత ఆనంద దాయకమైన, ఉత్తేజకరమైన కాలం. మా ఇద్దరి పార్ట్ నర్ షిప్స్ ఎప్పటికీ నాకు ప్రత్యేకంగా ఉంటాయి. 7 ప్లస్ 18’ అంటూ ధోనీ, తన జెర్సీ నంబర్లను ప్రస్తావిస్తూ కోహ్లీ ట్వీట్ చేశాడు.
గత ఏడాది ఒమన్, యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ భారత టీ 20 కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత టీమిండియా ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ, సెలెక్టర్లు అతడిని తప్పించారు. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 1-2తో ఓడిన తర్వాత కోహ్లీ టెస్టు పగ్గాలు కూడా వదులుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
ఇప్పుడు రోహిత్ నాయకత్వంలో విరాట్ శనివారం మొదలయ్యే ఆసియా కప్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత్ ఆదివారం జరిగే తన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో తలపడనుంది.