Irfan Phatan: ‘కోబ్రా’తో సినీరంగ ప్రవేశం చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. నటనలోనూ ఇరగదీశాడన్న సురేశ్ రైనా

Wishesh pours on team india former cricketer irfan pathan on his movie debut
  • విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఇర్ఫాన్
  • సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానన్న రాబిన్ ఊతప్ప
  • నీ పెర్ఫార్మెన్స్ చూడడం ఆనందంగా ఉందన్న సురేశ్ రైనా
  • ఆల్ ది బెస్ట్ చెబుతున్న అభిమానులు
క్రికెట్‌లో ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినీరంగంలో కాలుమోపాడు. విక్రమ్ నటించిన ‘కోబ్రా’ సినిమాలో ఇర్ఫాన్ ఓ కీలక పాత్రలో నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ఇర్ఫాన్ నటనపై తాజా, మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 

టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా స్పందిస్తూ.. చూస్తుంటే ఇది యాక్షన్ సినిమా అనిపిస్తోందని, నీ పెర్ఫార్మెన్స్ చూడడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని, సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. నీ ప్రయాణంలో కొత్త అవతారం ఎత్తినందుకు శుభాకాంక్షలు బ్రదర్ అంటూ టీమిండియా మాజీ ఓపెనర్ రాబిన్ ఊతప్ప ట్వీట్ చేశాడు. చాలా సంతోషంగా ఉందని, ‘కోబ్రా’ను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నాడు.

టీమిండియా యువ ఆటగాడు దీపక్ హుడా కూడా కోబ్రాలో ఇర్ఫాన్ నటనపై స్పందించాడు. ఈ ట్రైలర్ తనను ఓ దశాబ్దం వెనక్కి తీసుకెళ్లిందన్నాడు. తానో ఆల్‌రౌండర్‌నని ఇర్ఫాన్ తనతో అన్నాడని, ఇప్పుడా మాటలు నిలబెట్టుకున్నాడని పేర్కొన్నాడు. సిల్వర్ స్క్రీన్‌పై ఇర్ఫాన్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నట్టు  పేర్కొంటూ ట్రైలర్‌ను పంచుకున్నాడు. అభిమానులు కూడా ఇర్ఫాన్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఆల్ ది బెస్ట్’ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
Irfan Phatan
Cobra
Team India
Suresh Raina
Chiyaan Vikram

More Telugu News