UGC: దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు.. గుంటూరులో ఒకటి, విశాఖలో మరోటి: ప్రకటించిన యూజీసీ
- గుంటూరు కాకుమానువారితోటలోని క్రైస్ట్ న్యూటెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ..
- విశాఖ ఎన్జీవోస్ కాలనీలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలు నకిలీవన్న యూజీసీ
- దేశంలో అత్యధికంగా ఢిల్లీలో 8 నకిలీ యూనివర్సిటీలు
- వాటికి పట్టాలిచ్చే అధికారం లేదని స్పష్టీకరణ
దేశంలో 22 నకిలీ యూనివర్సిటీలు ఉంటే అందులో రెండు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్టు యూజీసీ ప్రకటించింది. యూజీసీ చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆ యూనివర్సిటీలకు డిగ్రీ పట్టాలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్ పేర్కొన్నారు. ఇక, యూజీసీ ప్రకటించిన 22 నకిలీ యూనివర్సిటీల్లో ఏపీలో రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి గుంటూరు కాకుమానువారితోటలోని క్రైస్ట్ న్యూటెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ కాగా, రెండోది విశాఖపట్టణం ఎన్జీవోస్ కాలనీలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. ఇక, దేశంలోనే అత్యధికంగా ఢిల్లీలో 8 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్టు యూజీసీ పేర్కొంది.
యూజీసీ ప్రకారం.. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (ఏఐఐపీపీహెచ్ఎస్), కమర్షియల్ యూనివర్సిటీ, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఒకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్-సెంట్రిక్ జ్యుడీషియల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఆధ్యాత్మక్ యూనివర్సిటీలు నకిలీవి కాగా, యూపీలో గాంధీ హిందీ విద్యాపీఠ్ (అలహాబాద్), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (కాన్పూరు), నేతాజీ సుభాష్ చంద్రబోస్ (ఓపెన్) యూనివర్సిటీ (అలీగఢ్), భారతీయ శిక్ష పరిథ్ (లక్నో) ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ (కోల్‌కతా), ఒడిశాలోని నవభారత్ శిక్షా పరిషత్ (రౌర్కెలా), నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (మయూర్భంజ్), కర్ణాటకలోని బుగవన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ (గోకాక్, బెల్గాం), కేరళ కిషనట్టంలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, నాగ్‌పూర్‌లోని రాజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు నకిలీవని, వాటికి డిగ్రీ పట్టాలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ స్పష్టం చేసింది.