Virat Kohli: నెల రోజులుగా బ్యాట్ పట్టకపోవడం పదేళ్లలో మొదటిసారి: కోహ్లీ
- ఉద్రేకం వద్దని శరీరం చెబుతోందన్న కోహ్లీ
- విరామం తీసుకోవాలని మనసు చెబుతోందని వ్యాఖ్య
- ప్రతి ఒక్కరికీ పరిమితి ఉంటుందని గుర్తు చేసే ప్రయత్నం
- మానసికంగా కుంగిపోయినట్టు వెల్లడి
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియాకప్ 2022తో తిరిగి బ్యాట్ పట్టనున్నాడు. ఆదివారం తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో భారత జట్టు తలపడనుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి, అతడు ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. సీనియర్ క్రికెటర్లు అతడ్ని వెనకేసుకొస్తున్నప్పటికీ, బయటి నుంచి విమర్శల జడివాన ఆగడం లేదు.
తాజాగా బీసీసీఐ సారథి గంగూలీ సైతం కోహ్లీ జట్టు కోసమే కాదు, తన కోసం కూడా పరుగులు సాధించాల్సి ఉందనడం కొసమెరుపు. ఎన్నో గొప్ప రికార్డులు కలిగిన కోహ్లీ సుదీర్ఘకాలంగా మంచి ఆటను ప్రదర్శించలేకపోవడాన్ని పెద్ద లోటుగా చూస్తున్నారు. దీంతో ఇటీవల కోహ్లీకి అవకాశాలు తగ్గాయి. అతడు తిరిగి గాడిన పడితే తప్ప నెగ్గుకు రాలేని పరిస్థితి నెలకొంది.
దీంతో కోహ్లీలోనూ ఫ్రస్ట్రేషన్ మొదలైనట్టుంది. విమర్శలతో అతడు కుంగిపోయి.. వేదాంతంగా మాట్లాడాడు. ‘‘నెల రోజుల పాటు నేను బ్యాట్ ను పట్టుకోకపోవడం పదేళ్లలో మొదటిసారి. నేను ఇటీవల నా దూకుడుని అనుకరించే ప్రయత్నం చేస్తున్నానని అర్థం చేసుకున్నాను. కానీ, ఉద్రేకం వద్దని నా శరీరం చెబుతోంది. నా మనసు కూడా కాస్త విరామం తీసుకుని, వెనకడుగు వేయాలని చెబుతోంది. నన్ను మానసికంగా చాలా దృఢంగా ఉన్న వ్యక్తిగా చూస్తుంటారు. కానీ, ప్రతి ఒక్కరికీ పరిమితి ఉంటుంది. దాన్ని మీరు గుర్తించాలి. లేదంటే పరిస్థితులే నీకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి’’ అని పేర్కొన్నాడు.
తాను మానసికంగా కుంగిపోయాయని కోహ్లీ అంగీకరించాడు. ‘‘మాననసికంగా బలహీనంగా కనిపించాలని మేము కోరుకోం. నన్ను నమ్మండి.. మానసికంగా బలంగా లేకపోయినా అలా కనపించేలా ఉండడం అన్నది బలహీనంగా ఉన్నట్టు అంగీకరించడం కంటే దారుణం’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.