Uttar Pradesh: యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె అనుమానాస్పద మృతి.. గొంతులో ఆహారం ఇరుక్కోవడమే కారణమన్న వైద్యులు
- ఐదేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లాడిన పూనమ్
- అపస్మారకస్థితిలో పడివున్న పూనమ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన సంజయ్
- అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించిన వైద్యులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె పూనమ్ మౌర్య (32) అనుమానాస్పద స్థితిలో మరణించారు. భోపాల్‌కు చెందిన సంజయ్ మౌర్యను ఐదేళ్ల క్రితం ఆమె వివాహం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొంతకాలం పనిచేసిన సంజయ్ ఆ తర్వాత సొంత వ్యాపారం ప్రారంభించారు. భోపాల్‌లోని అయోధ్యనగర్ ప్రాంతంలో భార్య, తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు.
గురువారం తాను నిద్ర లేచి చూసే సరికి పూనమ్ అపస్మారక స్థితిలో కనిపించిందని, వెంటనే సమీపంలోని రెండు ఆసుపత్రులకు తీసుకెళ్లానని సంజయ్ పేర్కొన్నారు. పరీక్షించిన అక్కడి వైద్యులు ఆమెను ప్రభుత్వ హమీదియా ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారని తెలిపారు. అక్కడకు తీసుకెళ్లగా, అప్పటికే పూనమ్ మరణించినట్టు చెప్పారని పోలీసులకు చెప్పారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టంలో గొంతులో ఆహారం ఇరుక్కుపోవడం వల్ల ఊపిరి ఆడక మరణించినట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.