Aadhaar details: ఆధార్ కార్డులో ‘డేట్ ఆఫ్ బర్త్’ ఎన్ని సార్లు మార్చుకోవచ్చు..?
- పుట్టిన తేదీలో ఒక్కసారి సవరణకు అనుమతి
- రెండో సారి సవరణ కోరితే రీజినల్ ఆఫీస్ వరకు వెళ్లాలి
- జెండర్, పేరులో మార్పులకు అనుమతి
ఆధార్ కార్డులో తప్పులు పడితే వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలను సవరించుకోవచ్చు. కాకపోతే కొన్నింటి విషయంలో పరిమితులు ఉన్నాయి. ఆధార్ లో ఏది సవరించుకోవాలన్నా, దానికి అనుబంధంగా నమోదైన మొబైల్ నంబర్ యాక్టివ్ లో ఉండాలని గుర్తు పెట్టుకోండి. మొబైల్ నంబర్ మారిపోతే దాన్ని ఆధార్ డేటాబేస్ లో అప్ డేట్ చేసుకోవాలి. దీని కోసం సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా మీసేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకోవడం వీలు పడదు.
ఆధార్ కార్డులో పేరులో తప్పు దొర్లితే సవరించుకోవచ్చు. కాకపోతే రెండు సార్లకే అనుమతి ఉంటుంది. ఆ తర్వాత సవరణ వీలు పడదు.
డేట్ ఆఫ్ బర్త్ అన్నది కీలకమైనది. ఒకే ఒక్కసారి పుట్టినతేదీలో మార్పులకు అనుమతిస్తారు. ఇక రెండో విడత మార్పు కోరితే అది అసాధారణ కేసుగా పరిగణిస్తారు. రెండో విడత పుట్టిన తేదీలో మార్పు కోరుకునే వారు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రీజినల్ ఆఫీస్ కు వెళ్లి అనుమతి కోరాల్సి ఉంటుంది. అధికారులు కార్డుదారు చెప్పే వివరాలు, ఆధారాలతో సంతృప్తి చెందితే సవరణ అభ్యర్థనను ఆమోదిస్తారు.
స్త్రీ, పురుష వివరాల్లో తప్పు చోటు చేసుకుంటే, కేవలం ఒకే ఒక్కసారి సవరణకు యూఐడీఏఐ అనుమతిస్తుంది. రెండో సారి కూడా సవరణ కోరితే డేట్ ఆఫ్ బర్త్ లో చెప్పిన మాదిరే ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.