Elon Musk: ప్రపంచ కోటీశ్వరుడు ఎలన్ మస్క్ తల్లి కారు గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చింది..!
- తన కుమారుడిని చూడటానికి వచ్చినప్పుడు ఇది జరిగిందంటూ స్వయంగా వెల్లడించిన మస్క్ తల్లి మయే మస్క్
- ఎలన్ కు సొంత ఇల్లు లేకపోవడమే దీనికి కారణమని వెల్లడి
- మస్క్ లా అంతరిక్షానికి వెళ్లాలని తనకు కోరిక లేదని వివరణ
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి టెక్ సంస్థల యజమాని ఎలన్ మస్క్ తల్లి ఒకరోజు కారు గ్యారేజీలో నిద్రించారు. అది కూడా ఆమె తన కుమారుడిని చూసేందుకు వచ్చినప్పుడు అలా గ్యారేజీలో నిద్రించాల్సి రావడం గమనార్హం. ఈ విషయాన్ని ఇటీవల ఆమెనే స్వయంగా వెల్లడించారు. అంతేకాదు తనకు ఎలన్ మస్క్ లా అంతరిక్షంలోకి వెళ్లాలన్న కోరిక లేదని పేర్కొన్నారు. ఈ వివరాలతో ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలను కూడా ప్రచురించాయి.
సొంత ఇల్లు లేకనే..
నిజానికి ఎలన్ మస్క్ ఇంత కుబేరుడు అయినా తనకంటూ సొంత ఇల్లు ఉంచుకోడు. తనకు సొంత ఇల్లు లేదని ఆయన స్వయంగా ఇటీవల ప్రకటించారు కూడా. ఇప్పుడు ఆయన ఉంటున్న నివాసం కూడా స్పేస్ ఎక్స్ సంస్థ నుంచి అద్దెకు తీసుకుని ఉంటున్నదే. ఈ క్రమంలో ఆయన తల్లి మయే మస్క్.. ఇటీవల టెక్సాస్ లోని మస్క్ నివాసానికి వెళ్లారు. దానికి సమీపంలోనే స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం కూడా ఉంటుంది. అది రాకెట్ ప్రయోగ ప్రాంతం కావడంతో.. ఎలాంటి విలాసవంతమైన ఇళ్లు ఉండవు. దానితో తాను ఓ గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చిందని మయే మస్క్ వెల్లడించారు.
అంతరిక్షంలోకి వెళ్లడం ఇష్టం లేదు
ఎలన్ మస్క్ కు అంగారక గ్రహానికి వెళ్లాలన్న కోరిక ఉంది. దీనిపై మయే మస్క్ ను మీడియా ప్రశ్నించగా.. తనకు అలాంటి కోరిక లేదని వెల్లడించారు. అంగారకుడిపైకి ప్రయాణించేందుకు ఆరు నెలల పాటు ఏర్పాట్లు చేసుకోవాలని.. ఏకాంతంగా ఉండాల్సి వస్తుందని.. దీనిపై తనకు ఆసక్తి లేదని చెప్పారు. అయితే తన పిల్లలు వెళ్దామని కోరితే అప్పుడు ఆలోచిస్తానని పేర్కొన్నారు.