CM KCR: నాడు తెలంగాణ వ్యతిరేకులతో జై తెలంగాణ అనిపించాం... ఇప్పుడు రైతు వ్యతిరేకులతో జై కిసాన్ అని పలికిస్తాం: సీఎం కేసీఆర్

CM KCR meeting with farmer representatives concluded

  • రెండ్రోజుల పాటు రైతు సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశం
  • నేటితో ముగిసిన సమావేశాలు
  • పలు అంశాలపై చర్చ
  • ఐక్యపోరాటం చేయాలని నిర్ణయం

రైతు సంఘాల నేతలతో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ వరుసగా రెండోరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. జాతీయస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి రంగం, గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై చర్చించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం ఎలా ఉంది? బీజేపీయేతర రాష్ట్రాల్లో రైతుల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే అంశాలను కూడా సమీక్షించారు.

కాగా, దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో, గ్రామస్థాయి నుంచే రైతులు ఏకం కావాలని నేతలు తీర్మానించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఓ భరోసా అందించేలా కార్యాచరణ ఉండాలని అభిలషించారు. రైతులు నష్టపోయేలా ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని నిర్ణయించారు. 

 రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం చేద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయ నిర్ణయాల్లో భాగంగా రైతులు నష్టపోయే చర్యలను ఎండగట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించాలని, అప్పుడే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారానే గమ్యాన్ని చేరుకోగలమని వివరించారు. తెలంగాణ వ్యతిరేకులతో నాడు జై తెలంగాణ అనిపించినట్టే, నేడు రైతు వ్యతిరేకులతో జై కిసాన్ నినాదాన్ని పలికించాలని అన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటనగా ఏర్పడి ప్రతినబూనాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 

ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం అని, రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుందని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగుపడుతుందని స్పష్టం చేశారు. దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మగౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని జాతీయ రైతు సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు.

  • Loading...

More Telugu News