Team India: ఆసియా కప్ లో హైఓల్టేజ్ మ్యాచ్... పాకిస్థాన్ పై టాస్ గెలిచిన టీమిండియా
- ఆసియా కప్ లో దాయాదుల సమరం
- దుబాయ్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- పాకిస్థాన్ కు మొదట బ్యాటింగ్
ఆసియా కప్ లో దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. దుబాయ్ లో జరుగుతున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో టాస్ వేశారు. టాస్ నెగ్గిన టీమిండియా సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. కరోనా నుంచి కోలుకున్న ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ అందుబాటులోకి రావడంతో టీమిండియా శిబిరంలో ఉత్సాహం నెలకొంది.
టాస్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, టాస్ కీలకమని తాము భావించడంలేదని, నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ఈ మ్యాచ్ బరిలో దిగుతున్నామని స్పష్టం చేశాడు. గతంలో ఇక్కడ జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో రాణించామని, పిచ్ సహకరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపాడు. ఈ మ్యాచ్ కు రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడం బాధాకరమని పేర్కొన్నాడు.
ఇక పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్ మాట్లాడుతూ, తాము టాస్ గెలిచినా గానీ మొదట బౌలింగే తీసుకునేవాళ్లమని వెల్లడించాడు. ఇప్పుడు తాము మొదట బ్యాటింగ్ చేస్తున్నందున భారీ స్కోరు సాధించడంపై దృష్టి సారిస్తామని తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం తాము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతున్నామని వివరించాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా టీ20 అరంగేట్రం చేస్తున్నాడని బాబర్ అజామ్ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యజువేంద్ర చహల్, అర్షదీప్ సింగ్.
బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, కుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షానవాజ్ దహానీ.