sex change operation: ఐపీఎస్ దంపతుల కుమార్తెకు.. శస్త్రచికిత్సతో లింగమార్పిడి
- ఒడిశాలో జరిగిన ఘటన వెలుగులోకి
- 22 ఏళ్ల యువతికి ఢిల్లీలో చికిత్స
- తల్లిదండ్రుల సమ్మతి
- డాక్యుమెంట్లలో జెండర్ మార్చే పని
ఇదొక అరుదైన కేసు. లింగమార్పిడి శస్త్ర చికిత్సల గురించి గతంలోనూ విన్నాం. కాకపోతే ఇప్పుడు చెప్పుకోబోయే కేసు సమాజంలో గుర్తింపు కలిగిన ఐపీఎస్ దంపతుల కుమార్తెకు సంబంధించినది. ఒడిశాలోని ఐపీఎస్ దంపతులకు చెందిన 22 ఏళ్ల కుమార్తె తల్లిదండ్రుల సమ్మతితో విజయవంతంగా లింగమార్పిడి శస్త్రచికిత్స (సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ) చేయించుకుంది.
ఐపీఎస్ దంపతుల కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. ఇటీవలే ఢిల్లీలో సదరు యువతికి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించారు. అనంతరం డాక్యుమెంట్లు, పాస్ పోర్ట్ లోనూ జెండర్ మార్చే పనిని ఆమె తల్లిదండ్రులు ప్రారంభించారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో మేనేజ్ మెంట్ స్టడీస్ చేస్తోంది.
లింగ మార్పిడి శస్త్ర చికిత్సను ప్లాస్టిక్ సర్జన్, గైనకాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, సైకియాట్రిస్ట్ తో కూడిన వైద్య బృందం చేస్తుంటుంది. సర్జరీ తర్వాత పూర్తిగా పురుష హార్మోన్లు అభివృద్ధి చెందడానికి రెండేళ్లు పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
‘‘లింగమార్పిడి చికిత్స చేయించుకున్న వారు జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ (జీఐడీ) ఎదుర్కొంటుంటారు. మహిళ తనను తాను పురుషుడిగా భావిస్తూ, అదే విధంగా ప్రవర్తించొచ్చు. కానీ, మహిళా క్రోమోజోముల కారణంగా పురుషుల పట్ల ఆకర్షణ కొనసాగుతుంది’’ అని అంటున్నారు. పురుషుడిని మహిళగా మార్చడం కంటే.. మహిళను పురుషుడిగా మార్చే సర్జరీ క్లిష్టమైనదిగా చెబుతున్నారు.