Anand Mahindra: మట్టి వినాయకుడిని తయారు చేస్తున్న చిన్నారి ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ఫిదా
- వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆనంద్
- నైపుణ్యం ఉన్న శిల్పిలా తయారు చేస్తున్నాడని కితాబు
- మెచ్చుకుంటున్న నెటిజన్లు..
- బాల కార్మికులను ప్రోత్సహించేలా ఉందని మరికొందరి విమర్శ
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తరచూ ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజా అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ముఖ్యంగా ప్రతిభను వెలుగులోకి తేవడంలో ఆయనది అందెవేసిన చేయి. తాజాగా ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియో ట్రెండ్ అవుతోంది.
ఓ చిన్న పిల్లాడు చేతితో మట్టి వినాయకుడి ప్రతిమను తయారు చేస్తున్న వీడియోను ఆనంద్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో సదరు చిన్నారి చాలా ఒడుపుగా, జాగ్రత్తగా వినాయకుడి ప్రతిమను తీర్చిదిద్దాడు. తన చిట్టి చేతులతో గణనాధుడి తొండానికి ఆకారం తెస్తున్న ఈ క్లిప్ లో అతను ఎంతో నైపుణ్యం ఉన్న ప్రొఫెషనల్ ఆర్టిస్టు మాదిరిగా శిల్పాన్ని రూపొందిస్తున్నట్లుగా అనిపించింది.
‘అతని చేతులు గొప్ప శిల్పి మాదిరిగా కదులుతున్నాయి. ఇలాంటి చిన్నారులకు తగిన శిక్షణ ఇవ్వాలా? లేక వారి ప్రతిభను వదులుకోవాలా? అనేది అర్థకావడం లేదు’ అని మహీంద్ర ట్వీట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే ఐదు లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. అయితే, ఆనంద్ మహీంద్ర ట్వీట్ పై మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. కొంత మంది ఆ చిన్నారితో చాలా ప్రతిభ ఉందని, దాన్ని వెలుగులోకి తెచ్చిన ఆనంద్ ను పొగుడుతున్నారు. మరికొందరు మాత్రం మహీంద్రా లాంటి వ్యక్తి బాలుడి వీడియోను పోస్ట్ చేసి బాల కార్మికులను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని పెదవి విరిచారు.