Canada: ఏఆర్ రెహమాన్ కు కెనడా అపూర్వ గౌరవం.. ఓ వీధికి సంగీత దర్శకుడి పేరు

Canadian city honours AR Rahman by naming a street after him
  • మార్కమ్ పట్టణంలోని ఓ వీధికి ఏఆర్ రెహమాన్ గా నామకరణం
  • ధన్యవాదాలు తెలియజేసిన విఖ్యాత సంగీత దర్శకుడు
  • కెనడా ప్రజలకు మంచి జరగాలని అభిలాష
గ్రామీ, ఆస్కార్ అవార్డుల గ్రహీత అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పట్ల కెనడా తన గౌరవ భావాన్ని చాటుకుంది. కెనడాలోని మార్కమ్ అనే చిన్న పట్టణంలోని ఓ వీధికి ఏఆర్ రెహమాన్ పెరు పెట్టారు. 3.3 లక్షల జనాభా కలిగిన చిన్న పట్టణం ఇది. టొరంటోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ స్వయంగా పంచుకున్నారు. 

ఈ సందర్భంగా మార్కమ్ పట్టణ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టికి ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక స్టేట్ మెంట్ జారీ చేశారు. కెనడా ప్రజల పట్ల కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. ‘‘నేను నా జీవితంలో ఇలాంటిది ఊహించలేదు. నిజంగా మీ అందరికీ, మార్కమ్ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టి, కౌన్సిలర్లు, ఇండియన్ కాన్సులేట్ జనరల్ (అపూర్వ శ్రీవాస్తవ), కెనడా ప్రజలకు కృతజ్ఞుడిని. 

ఏఆర్ రెహమాన్ అన్న పేరు నాది కాదు. దీనర్థం దయాగుణం. మనందరి ఉమ్మడి దేవుడి గుణం. దీనికి మనం సేవకులం. కనుక ఈ పేరు ప్రశాంతతను, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని కెనడా ప్రజలకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దేవుడి దీవెనలు ఉండాలి. భారత్ లో నా పట్ల ప్రేమ చూపించే నా సోదరులు, సోదరీమణులకు సైతం నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎంతో సృజనాత్మకత కలిగిన వారు నాతో కలసి పనిచేసి నన్ను వందేళ్ల సినిమా ప్రపంచంలో సెలబ్రిటీని చేశారు. కానీ, నేను ఈ సముద్రంలో చిన్న బిందువును. విశ్రాంతి తీసుకోకుండా మరింత సేవ చేయాలని, స్ఫూర్తినీయంగా ఉండాలని నాపై బాధ్యతను ఇది పెంచింది’’ అని ఏఆర్ రెహమాన్ ట్వీట్ చేశారు.
Canada
city
markham
street
named AR REHMAN

More Telugu News