Ganji Chiranjeevi: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నేత గంజి చిరంజీవి
- మంగళగిరి నియోజకవర్గ టీడీపీలో కీలక నేత చిరంజీవి
- జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న చిరంజీవి
- టీడీపీలో బీసీలకు సరైన గౌరవం లేదని విమర్శ
నారా లోకేశ్ నియోజకవర్గమైన మంగళగిరిలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మంగళగిరి టీడీపీలో కీలక నేత అయిన గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. గంజి చిరంజీవిని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో గంజి చిరంజీవి మాట్లాడుతూ, జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు సరైన గౌరవం లేదని విమర్శించారు. నిరంతరం బీసీలను అవమానాలకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీలో మొత్తం పెత్తనమంతా ఒకే సామాజికవర్గానిదని విమర్శించారు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేశారని అన్నారు. టీడీపీలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా గౌరవం లేదని చెప్పారు.