Mukesh Ambani: రిలయన్స్ లో కొత్త నాయకత్వం... అనంత్, ఈషాలకు పట్టాభిషేకం చేసిన ముఖేశ్ అంబానీ
- ఇప్పటికే ఆకాశ్ కు జియో బాధ్యతలు
- నూతన ఇంధన వ్యాపారం అనంత్ కు అప్పగింత
- కుమార్తె ఈషాకు రిటైల్ వర్తక బాధ్యతలు
- మూడు వ్యాపారాలు సమానమేనన్న ముఖేశ్ అంబానీ
- నాయకత్వ బదలాయింపు ప్రణాళికలు సాఫీగా అమలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వార్షిక సర్వసభ్య సమావేశం నేడు ముంబయిలో జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రిలయన్స్ నాయకత్వ బదిలీ ప్రణాళికల్లో భాగంగా, తన వారసులకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు.
ఆకాశ్ అంబానీ ఇప్పటికే రిలయన్స్ జియో చైర్మన్ గా నియమితుడు కాగా, తమ గ్రూప్ నూతన ఇంధన వ్యాపార బాధ్యతలు నిర్వర్తించేది చిన్న కుమారుడు అనంత్ అని, రిటైల్ వర్తక విభాగం అధిపతి ఈషా అంబానీ అని ముఖేశ్ అంబానీ ప్రకటించారు.
నాయకత్వ బదలాయింపుపై ముఖేశ్ అంబానీ గతేడాదే వెల్లడించారు. గత జూన్ లో ఆకాశ్ అంబానీని జియో చైర్మన్ పీఠం ఎక్కించిన ముఖేశ్... ఇప్పుడు మిగతా ఇద్దరు సంతానానికి వ్యాపార బాధ్యతల పంపకాలు చేశారు. అయితే, తాను ఇప్పట్లో వ్యాపార రంగం నుంచి తప్పుకోబోనని, రిటైర్మెంట్ ఆలోచనే లేదని స్పష్టం చేశారు.
ఆకాశ్, ఈషా ఇప్పటికే తమ బాధ్యతల్లో కొనసాగుతున్నారని, తాజాగా తమ గ్రూప్ లోకి అనంత్ ను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ మూడు విభాగాలు సమానమేనని, రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ ఆలోచనల నుంచి పుట్టినవేనని ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు.