AP Genco: ఏపీ జెన్‌కోకు మొత్తం రూ. 6,756.92 కోట్లు చెల్లించండి.. తెలంగాణను ఆదేశించిన కేంద్రం
- విద్యుత్ సరఫరా బిల్లు రూ. 3,441.78 కోట్లతోపాటు రూ.3,315.14 కోట్ల సర్‌చార్జ్ చెల్లించాల్సిందేనన్న కేంద్రం
- విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం తెలంగాణను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టీకరణ
- 30 రోజుల్లో చెల్లించాల్సిందేనని ఆదేశం
ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్‌కు గాను చెల్లించాల్సిన రూ. 3,441.78 కోట్లతోపాటు, చెల్లింపులో జరిగిన జాప్యానికి సర్‌చార్జ్ రూ.3,315.14 కోట్లు (31 జులై 2022 వరకు) కలిపి మొత్తంగా రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అంతేకాదు, ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 నిబంధనల మేరకు కేంద్రం ఆదేశాలతో తెలంగాణకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని పేర్కొన్న కేంద్రం.. విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం బకాయిలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. విభజన జరిగిన తర్వాత విద్యుత్ సరఫరా జరిగిందని, కాబట్టి విభజన వివాదాలతో దీనిని ముడిపెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కాబట్టి 30 రోజుల్లో మొత్తం బకాయిలను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.
అయితే, తెలంగాణ వాదన మరోలా ఉంది. విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ పరిధిలోని కేంద్రీయ విద్యుత్ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్) పరిధిలో ఉన్నాయని తెలంగాణ విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు విద్యుత్ సంస్థలు రుణాలు తీసుకున్నాయని పేర్కొన్నాయి. ఈ రుణాల చెల్లింపునకు తీసుకున్న మొత్తం రూ.12,941 కోట్లు ఉంటుందని, ఈ లెక్కన ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఇవే ఎక్కువని, కాబట్టి ఏపీకి బకాయిలు చెల్లించే ప్రశ్నే లేదని గతంలో పలుమార్లు పేర్కొన్నాయి. అయితే, ఇప్పుడు కేంద్రం ఆదేశాలతో తప్పక చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది.