Revanth Reddy: తెలంగాణను ఆక్రమించడానికి మోదీ.. దేశాన్ని ఆక్రమించడానికి కేసీఆర్ బయల్దేరారు: రేవంత్ రెడ్డి
- మునుగోడు ఉప ఎన్నిక కోసం సెప్టెంబర్ 1 నుంచి క్షేత్ర స్థాయిలోకి వెళ్తున్నామన్న రేవంత్
- బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నాయని ఆరోపణ
- కేసీఆర్ తెలంగాణ మోడల్ అంటే భూదోపిడీ, అవినీతా? అంటూ ప్రశ్న
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పార్టీ ఫిరాయింపుల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నాయని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి క్షేత్ర స్థాయిలోకి వెళ్తామని రేవంత్ చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి గ్రామగ్రామానికి ఇన్ఛార్జీలను నియమిస్తామని తెలిపారు.
తెలంగాణను ఆక్రమించడానికి మోదీ... దేశాన్ని ఆక్రమించడానికి కేసీఆర్ బయల్దేరారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో గులాం నబీ ఆజాద్ పై కూడా రేవంత్ విమర్శలు గుప్పించారు. రాజ్యసభ సీటు రెన్యువల్ కాలేదనే ఆయన పార్టీని వీడారని అన్నారు. మోదీకి గులాం నబీ ఆజాద్ గులాంలా మారారని ఎద్దేవా చేశారు.