Protein: పండ్లు తినడం మంచిదే.. మరి ఏ పండ్లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి? నిపుణుల సూచనలివీ..
- కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్ల అవసరం శరీరానికి ఎక్కువ
- కొన్ని రకాల పండ్లలో అత్యధిక స్థాయిలో ప్రోటీన్లు
- మన డైట్ లో ఆయా పండ్లను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణుల సూచన
సాధారణంగా అన్ని రకాల పండ్లు శరీరానికి మంచివే అని వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే పండ్లలో శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉన్నా.. ప్రోటీన్ల శాతం మాత్రం తక్కువగానే ఉంటుంది. ప్రోటీన్లు ప్రధానంగా పప్పు ధాన్యాలు, కొన్ని రకాల కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే పండ్లలో ఉండే కొన్ని రకాల ప్రోటీన్లు మన శరీరంలో కీలక జీవక్రియలు సమర్థవంతంగా కొనసాగేందుకు తోడ్పడుతాయి. నిజానికి కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం అత్యంత ఆవశ్యకమని నిపుణులు చెబుతుంటారు కూడా. ఈ నేపథ్యంలో ఏయే పండ్లలో ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటుందనేదానిపై నిపుణులు చెబుతున్న సూచనలివీ..
జామ పండ్లు
మిగతా పోషకాల సంగతేమోగానీ ప్రోటీన్ల విషయానికి వస్తే జామ పండ్లు రారాజు అని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో కప్పు జామ పండు ముక్కల్లో 4.2 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని వివరిస్తున్నారు. నిజానికి మన దేశంలో జామ పండ్లు విస్తృతంగా లభిస్తున్నా వాటిని తీసుకునేవారు ఇటీవలి కాలంలో తగ్గిపోయారని.. ఇతర రకాల పండ్ల వినియోగం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. జామ పండ్లలో ప్రోటీన్లతోపాటు విటమిన్ సీ, పొటాషియం, పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. ఇక జామపండ్లలో ఉండే క్వెర్సిటిన్, కేటచిన్, ఐసోఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు గణనీయంగా ఉంటాయని.. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలూ ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జామ పండ్లలో తొక్క నుంచి గింజల దాకా అన్నింటిలోనూ మేలు చేసే లక్షణాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
అవకాడో
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పండ్ల విషయానికి వస్తే అవకాడో కూడా ముందు వరుసలో ఉంటుంది. ఒక కప్పు అవకాడోలో కనీసం 3 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో దీనిలో సోడియం, కార్బోహైడ్రేట్లు తక్కువ స్థాయిలో ఉంటాయి. అందువల్ల డైటింగ్ పాటించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. న్యూట్రియంట్స్ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం.. అవకాడోను తరచూ తీసుకోవడం వల్ల గుండె కవాటాలకు సంబంధించి వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం బాగుంటుంది.
ఆప్రికాట్లు
ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉండే పండ్లలో ఆప్రికాట్లు కూడా ఒకటి. వీటిలో పచ్చి ఆప్రికాట్లలో ఒక కప్పు పండ్లకు 2.2 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అదే ఎండు ఆప్రికాట్లలో ఒక్కో కప్పుకు ఏకంగా 5 గ్రాములు ఉంటాయి. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారికి ఆప్రికాట్లతో మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ ఏ, సీ, ఈ లతోపాటు కెరోటినాయిడ్లు, పొటాషియం, జింక్ వంటివి గణనీయ మొత్తంలో ఉంటాయని వివరిస్తున్నారు. వీటికితోడు క్వెర్సెటిన్, కటెచిన్, క్లోరోజెనిక్ యాసిడ్లు వంటి యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్ రసాయనాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.
కివీ పండ్లు
కాస్త పుల్లగా, తీయగా ఉండే కివీ పండ్లలో ఒక కప్పుకు 2.1 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని.. దానికితోడు పొటాషియం, విటమిన్ సీ, ఈ, కె వంటి కీలక పోషకాలూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తరచూ కివీ పండ్లను తీసుకోవడం వల్ల మల బద్ధకం, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని సూచిస్తున్నారు.
బ్లాక్ బెర్రీస్
తిన్నాక నోరంతా ఒక రకంగా మారిపోయే బ్లాక్ బెర్రీలను చాలా మంది ఇష్టపడరు. కానీ ఆరోగ్యకరమైన పండ్ల జాబితాలో వీటికి ప్రత్యేక స్థానం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు బ్లాక్ బెర్రీలలో 2 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయని.. 8 గ్రాముల ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ సీ, కె వంటి ఆవశ్యక పోషకాలు కూడా ఉంటాయని వివరిస్తున్నారు.
నారింజ
సాధారణ సైజులోని ఒక నారింజ పండులో ఒక గ్రాము ప్రోటీన్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా పీచు పదార్థాలు (ఫైబర్), విటమిన్ ఏ, సీ లతోపాటు కాల్షియం ఉండే నారింజ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. నారింజ అనే కాకుండా అన్ని రకాల పుల్లటి పండ్లు (సిట్రస్ ఫ్రూట్స్)లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయని.. ఇవి కేన్సర్, గుండె జబ్బులు, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా తోడ్పడతాయని పేర్కొంటున్నారు.
అరటిపండ్లు
మనం సాధారణ పండ్లుగా భావించే అరటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతి కప్పు అరటి పండులో 1.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని.. ఫైబర్ శాతం ఎక్కువేనని వివరిస్తున్నారు. అంతేగాకుండా.. విటమిన్ బీ6, సీ, పొటాషియం వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయని.. గుండె, నాడీ సంబంధ ఆరోగ్యానికి అరటి పండు ఎంతో ప్రయోజనకరమని స్పష్టం చేస్తున్నారు.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
శరీరానికి అందాల్సిన ప్రోటీన్లు, ఇతర పోషకాల పరిమాణం వ్యక్తులను బట్టి మారుతుందని వైద్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పండ్లు ఏవైనా సరే మంచి ఆరోగ్యానికి తోడ్పడినా.. కొందరి విషయంలో అధిక కేలరీలకు, ఎలర్జీలు, ఇతర సమస్యలకు దారి తీయవచ్చని అంటున్నారు. అందువల్ల వైద్యులు, పోషకాహార నిపుణుల సలహా తీసుకుని.. తమకు తగిన డైట్ ను పాటిస్తే మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.