Telangana: పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా?: కేసీఆర్‌ను ప్రశ్నించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ఇబ్రహీంపట్నంలో ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళల మృతి
- బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్
- బాధితులను పరామర్శించడం కంటే రాజకీయాలే ఎక్కువయ్యాయన్నకోమటిరెడ్డి
- ఈ అంశాలను ప్రస్తావిస్తూ కేసీఆర్‌కు లేఖ రాసిన వెంకట్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం ఆయనకు ఓ లేఖ రాశారు. పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా? అంటూ సదరు లేఖలో సీఎంను కోమటిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన విషయాన్ని సదరు లేఖలో కోమటిరెడ్డి ప్రస్తావించారు.
సీఎం కేసీఆర్ బుధవారం పాట్నా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లతో భేటీ అయిన కేసీఆర్... జాతీయ రాజకీయాలపై వారితో కీలక చర్చలు జరిపారు. ఇటు ఇబ్రహీంపట్నం మృతులు, అటు బీహార్ పర్యటనలను ప్రస్తావిస్తూ కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే మీకు వారిని పరామర్శించే తీరిక లేదు.. కానీ విమానంలో పాట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే టైం ఉందా? అంటూ కోమటిరెడ్డి సదరు లేఖలో కేసీఆర్‌ను ప్రశ్నించారు.