liger: ఏడో రోజూ ‘లైగర్’కు నిరాశే.. కోటి కూడా దాటని వసూళ్లు
- అన్ని భాషల్లో కలిపి ఏడో రోజు వచ్చింది రూ. 90 లక్షలు మాత్రమే
- మరికొన్ని రోజుల్లో థియేటర్ల నుంచి వైదొలిగే అవకాశం
- 90 కోట్లతో నిర్మించిన చిత్రానికి భారీ నష్టాలు
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ సినిమా 2022లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఒక్క వారంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా క్రాష్ అయ్యింది. దేశం మొత్తం మీద అన్ని భాషల్లో కలిపి రోజుకు కోటి రూపాయాల వసూళ్లు కూడా రాబట్టడం కష్టం అవుతోంది.
‘లైగర్’ చిత్రంపై విమర్శకులు పెదవి విరవగా.. ప్రేక్షకులు సైతం ఏ మాత్రం ఆదరించలేకపోయారు. భారీ ఓపెనింగ్స్ లభించినప్పటికీ, నెగిటివ్ మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా నిండా మునిగిపోయింది. దెబ్బకు వారం రోజుల్లోనే థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఏడో రోజు ఇండియా మొత్తం మీద రూ. 90 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీన్ని బట్టి ఈ చిత్రం ఎంత దారణంగా ఫెయిలైందో చెప్పొచ్చు. ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే సినిమా థియేటర్ల నుంచి పూర్తిగా వైదొలగే అవకాశం ఉంది.
పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ ఆగస్టు 25 న తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదలైంది. ఇది విజయ్ దేవరకొండ కు మొదటి పాన్-ఇండియా చిత్రం. పూరీ, చార్మీ కౌర్, కరణ్ జొహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం విజయ్, పూరీ మూడేళ్లు కష్టపడ్డారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అతిథి పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా, విజయ్, అనన్య దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. కానీ, కథ, కథనం ఏదీ ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. దాదాపు రూ. 90 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు, పంపిణీదారులకు నష్టాలను మిగల్చనున్నట్టు చెబుతున్నారు.