Rashmi Gautam: రష్మీని హిందూ వ్యతిరేకి అన్న నెటిజన్... తానేంటో చెబుతూ వివరణ ఇచ్చిన టీవీ యాంకర్
- గణనాథుడికి గజరాజుతో పూల మాల వేయించడంపై స్పందించిన రష్మీ
- రష్మీ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్
- తాను లెదర్ ఉత్పత్తులను వాడనని, పాల పదార్థాలను భుజించనని వివరణ ఇచ్చిన యాంకర్
జంతువులపై హింసను ఖండిస్తూ... జంతువుల పట్ల ఎలా మెలగాలో చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టే ప్రముఖ టీవీ యాంకర్ రష్మీ గౌతమ్‌ను ఓ నెటిజన్ హిందూ వ్యతిరేకిగా అభివర్ణించాడు. సదరు నెటిజన్‌పై ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేయకుండానే రష్మీ చాలా మర్యాదపూర్వకంగా అసలు తానేంటో వివరణ ఇస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.
వినాయక చవితి సందర్భంగా ఓ భారీ గణనాథుడి విగ్రహానికి కొందరు వ్యక్తులు బుధవారం గజరాజుతో పూల మాల వేయించారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన రష్మీ.. పూల మాల వేసే సమయంలో గజరాజు ఎంతగా ఇబ్బంది పడిందోనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వినోదం కోసం జంతువులను వినియోగించరాదంటూ అభ్యర్థిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు సమాధానమిచ్చిన ఓ నెటిజన్... మీరు జంతు ప్రేమికులేమీ కాదని మాకు తెలుసు. మీరు హిందూ వ్యతిరేకులు అంటూ వ్యాఖ్యానించాడు.
సదరు నెటిజన్ వ్యాఖ్యకు తాజాగా గురువారం రష్మీ అదే ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తాను నంది, గోమాతలను గౌరవిస్తానని సదరు పోస్ట్‌లో రష్మీ పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను లెదర్‌తో చేసిన వస్తువులను వినియోగించనని కూడా తెలిపారు. అంతేకాకుండా తాను పాల పదార్థాలను భుజించనని కూడా రష్మీ పేర్కొన్నారు. ఎందుకంటే పాల వినియోగం కోసం గోమాత తన జీవిత కాలంలో ఎన్నోసార్లు గర్భం దాలుస్తోందని తెలిపారు. చివరగా ఓ మహిళగా రుతుక్రమంలో వచ్చే నొప్పి కూడా తనకు ఎంతగానో ఇబ్బందికరంగా ఉంటుందని రష్మీ పేర్కొన్నారు.