Bihar: చెవి నొప్పికి ఆపరేషన్ చేస్తే.. ఎడమ చేయిని కోల్పోయిన యువతి!
- చెవి నొప్పికి ఆపరేషన్ చేసిన వైద్యులు
- ఇంజక్షన్ కారణంగా చేతి రంగు మారిన వైనం
- ఏమీ కాదని చెప్పి పంపించేసిన వైద్యులు
- ప్రాణాలకు ప్రమాదమని చెప్పి చేయిని తొలగించిన మేదాంత వైద్యులు
- పెళ్లి రద్దు చేసుకున్న వరుడి కుటుంబం
చెవినొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతి తన ఎడమచేయిని కోల్పోవాల్సి వచ్చింది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిందీ ఘటన. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో రాజధాని పాట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు జులై 11న శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆమె ఎడమ చేతికి ఓ ఇంజక్షన్ ఇచ్చి పంపించారు. ఇంటికి వెళ్లిన రేఖ చేయి రంగు మారడంతోపాటు నొప్పిగా కూడా ఉండడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసి విషయం చెప్పింది. చూసిన వైద్యులు ఏమీ కాదని, తగ్గిపోతుందని చెప్పి పంపించేశారు.
వైద్యులు చెప్పినప్పటికీ మార్పు రాకపోవడంతో రేఖ పలు ఆసుపత్రుల్లో చూపించుకుంది. చివరికి పాట్నాలోని మేదాంత ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చేతిని తొలగించాల్సిందేనని, లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేఖ కుటుంబ సభ్యుల అంగీకారంతో శస్త్ర చికిత్స చేసి ఎడమ చేతిని తొలగించారు. కాగా, రేఖకు ఇటీవల వివాహ నిశ్చితార్థమైంది. నవంబరులో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే ఆమె చేతిని కోల్పోవడంతో వరుడి తరపు వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు.