BJP: హర్యానా ముఖ్యమంత్రి సన్నిహితుడి కాల్చివేత

BJP leader close to Haryana CM shot dead inside showroom in Gurugram
  • స్నేహితుడితో కలిసి క్లాత్ షోరూమ్‌కు వెళ్లిన సుఖి
  • లోపలే మాటేసి కాల్పులు జరిపిన ఐదుగురు దుండగులు
  • అక్కడికక్కడే మృతి చెందిన సుఖి
  • ఆయన బావమరిది చమన్‌పై సుఖి కుమారుడి ఫిర్యాదు
బీజేపీ నేత, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సన్నిహితుడు సుఖ్‌బీర్ ఖతానా అలియాస్ సుఖి దారుణ హత్యకు గురయ్యారు. రితోజ్ గ్రామానికి చెందిన సుఖి నిన్న తన స్నేహితుడితో కలిసి గురుగ్రామ్ సదర్ బజార్ ప్రాంతంలోని ఓ క్లాత్ షోరూముకు వెళ్లారు. అప్పటికే కాచుకున్న ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై తూటాల వర్షం కురిపించారు. తీవ్రంగా గాయపడిన సుఖిని వెంటనే సమీపంలోని ఆర్వీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్టు నిర్ధారించారు. 

సోహనా మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడైన సుఖి సోహనా జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండగానే ఈ ఘటన జరిగింది. స్నేహితుడు రాజేందర్‌తో కలిసి కారులో గురుద్వారా రోడ్డులోని రేమండ్ షోరూమ్‌కు సుఖి వెళ్లగా మధ్యాహ్నం 3.20 గంటల సమయంలో ఆయనపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు క్లాత్ షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు బ్లాక్ టి షర్టులు ధరించగా, ఒకరు వైట్ చెక్ షర్ట్, మరొకరు క్యాప్, మరొకరు రెడ్ షర్ట్ ధరించారు. సుఖిపై కాల్పులు జరిపిన తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. 

ఖతానా బావమరిది చమన్ తన స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు ఖతానా కుమారుడు అనురాగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరెస్సెస్ కార్యకర్త అయిన ఖతానా హత్యకు గురికావడానికి మూడు గంటల ముందు సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. నిందితుల్లో పలువురిని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
BJP
Haryana
Manohar Lal Khattar
Gurugram
Sukhbir Khatana

More Telugu News