Starbucks: కాఫీ దిగ్గజం 'స్టార్​ బక్స్' కొత్త సీఈవోగా భారతీయుడు

Meet Indian origin Laxman Narasimhan the new CEO of Starbucks

  • ప్రపంచంలో అత్యధిక కాఫీ షాపులు ఉన్న సంస్థ స్టార్ బక్స్
  • సంస్థ పగ్గాలు అందుకోనున్న లక్ష్మణ్ నరసింహన్
  • అక్టోబర్1న తమ కంపెనీలో చేరుతాడని ప్రకటించిన స్టార్ బక్స్ 
  • గతంలో రెకిట్ సంస్థకు సీఈవోగా పని చేసిన నరసింహన్ 

ప్రపంచంలో అత్యధిక కాఫీ షాపులు కలిగివున్న అమెరికా దిగ్జజం స్టార్ బక్స్ సంస్థ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్ కు చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. లక్ష్మణ్ నరసింహన్ ఇప్పటిదాకా రెకిట్ సంస్థకు సీఈవోగా పని చేశారు. గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన 55 ఏళ్ల లక్ష్మణ్... హోవార్డ్ షుల్ట్జ్ స్థానంలో స్టార్ బక్స్ సీఈవో పదవి చేపట్టబోతున్నారు.

అక్టోబర్ 1న లక్ష్మణ్ నరసింహన్ కంపెనీలో చేరతారని, అయితే 2023 ఏప్రిల్‌లోనే అధికారం చేపడతారని స్టార్‌బక్స్ తెలిపింది. అప్పటి వరకు తాత్కాలిక సీఈవో హోవార్డ్ షుల్ట్జ్ కంపెనీకి నాయకత్వం వహిస్తారు. లక్ష్మణ్ నరసింహన్ ఏప్రిల్ 1 వరకు హోవార్డ్ షుల్ట్జ్‌తో కలిసి పని చేస్తారు. ‘వినియోగదారుల కోసం శక్తిమంతమైన బ్రాండ్లను నిర్మించడంలో లోతైన అనుభవం ఉన్న నాయకుడు’ అని నరసింహన్‌ను స్వాగతిస్తూ ఉద్యోగులకు రాసిన లేఖలో షుల్ట్జ్ పేర్కొన్నారు.

పూణె విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ అయిన లక్ష్మణ్ నరసింహన్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని లాడర్ ఇన్స్టిట్యూట్ నుంచి జర్మన్, ఇంటర్నేషనల్ స్టడీస్ మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి వార్టన్ స్కూల్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీలో మాస్టర్స్ కూడా చేశారు. 2019 సెప్టెంబర్ లో రెకిట్‌లో చేరిన నరసింహన్ కరోనా మహమ్మారి సమయంలో కంపెనీకి మార్గనిర్దేశం చేయడంతో కంపెనీకి చెందిన ఆరోగ్యం, పరిశుభ్రత ఉత్పత్తుల అమ్మకాలు పెరిగాయి. 

అలాగే ఆయన పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. లాటిన్ అమెరికా, యూరప్ మరియు సబ్-సహారా ఆఫ్రికాలో కార్యకలాపాలను చూసేవారు. నరసింహన్ ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే కంపెనీలో సీనియర్ భాగస్వామిగా కూడా పనిచేశారు. అక్కడ ఆయన అమెరికా, ఆసియా, భారతదేశంలోని వినియోగదారు, రిటైల్, సాంకేతిక పద్ధతులపై దృష్టి సారించారు. కాగా, లక్ష్మణ్ నరసింహన్ తమ సీఈవో పదవి నుంచి వైదొలుగుతారని  రెకిట్ గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సంస్థ షేర్లు 4 శాతం పడిపోయాయి.

  • Loading...

More Telugu News