Serial Killer: మధ్యప్రదేశ్ లో సీరియల్ కిల్లర్ అరెస్ట్... కేజీఎఫ్ స్ఫూర్తితో వరుస హత్యలకు పాల్పడిన టీనేజర్
- సాగర్ జిల్లాలో వరుస హత్యలు
- ఐదు రోజుల వ్యవధిలో నలుగురి హత్య
- కేవలం సెక్యూరిటీ గార్డులనే లక్ష్యంగా చేసుకున్న కిల్లర్
- హంతకుడ్ని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు
- పోలీసుల అదుపులో 19 ఏళ్ల శివప్రసాద్ ధుర్వే
మధ్యప్రదేశ్ లోని సాగర్ లో ఇటీవల చోటుచేసుకున్న వరుస హత్యలు ప్రజలను బెంబేలెత్తించాయి. రాత్రివేళ నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే లక్ష్యంగా చేసుకుని హంతకుడు దారుణాలకు పాల్పడడం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఐదు రోజుల వ్యవధిలో నాలుగు హత్యలు జరగడంతో పోలీసులు దీన్నో సవాల్ గా తీసుకున్నారు. ఈ సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు సఫలం అయ్యారు.
భోపాల్ లోని బస్టాండ్ ఏరియాలో అతడిని చుట్టుముట్టిన పోలీసులు, అరెస్ట్ చేశారు. అతడిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంతజేసీ అతడో టీనేజి బాలుడు. అతడి పేరు శివప్రసాద్ ధుర్వే. వయసు 19 ఏళ్లు. సాగర్ జిల్లాలోని కేస్లీ ప్రాంతానికి చెందినవాడు. 8వ తరగతి వరకు చదువుకున్న ధుర్వే గతంలో గోవాలో కొంతకాలం పనిచేశాడు. కొద్దిగా ఇంగ్లీషు కూడా మాట్లాడగలడు.
కాగా, కేజీఎఫ్-2 చిత్రంలో రాకీభాయ్ లా పెద్ద గ్యాంగ్ స్టర్ అవ్వాలని కోరుకుంటున్నానని పోలీసుల విచారణలో తెలిపాడు. అందుకే ఈ వరుస హత్యలకు పాల్పడ్డానని, భవిష్యత్తులో పోలీసులను కూడా లక్ష్యంగా చేసుకుని హత్యాకాండ సాగించాలని భావిస్తున్నానని నిర్భయంగా చెప్పాడు. కాగా, పోలీసులు అరెస్ట్ చేసేందుకు కొన్ని గంటల ముందు కూడా భోపాల్ లో ఓ సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేసినట్టు ధుర్వే వెల్లడించాడు.
పోలీసులు అతడిని ఓ చాంబర్ లో ఉంచి విచారిస్తున్నారు. అయితే నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే ఎందుకు చంపుతున్నాడన్నది తెలియరాలేదు. తాను ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నానని మాత్రం చెప్పాడు.
కాగా, మహారాష్ట్రలోని పూణేలో గతంలో ఓసారి హత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో వరుస హత్యలకు పాల్పడినట్టు తెలిపాడు. గత మే నెలలో నిర్మాణంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద ఓ వాచ్ మన్ హత్య జరగ్గా, ఆ ఘటనతో తనకు సంబంధంలేదని ధుర్వే వెల్లడించాడు. మొత్తానికి సీరియల్ కిల్లర్ పోలీసులకు పట్టుబడడంతో సాగర్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.