Panja Vaisshnav Tej: మూవీ రివ్యూ: 'రంగ రంగ వైభవంగా'
- ఈ శుక్రవారమే విడుదలైన సినిమా
- రెండు కుటుంబాల నేపథ్యంలో నడిచే ప్రేమకథ
- గతంలో ఈ తరహాలో చాలానే వచ్చిన సినిమాలు
- రోటీన్ కథను తనదైన స్టైల్లో ఆవిష్కరించిన దర్శకుడు
- గ్లామర్ పరంగా .. నటన పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన కేతిక
- సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిన దేవిశ్రీ సంగీతం
వైష్ణవ్ తేజ్ హీరోగా రొమాంటిక్ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా 'రంగ రంగ వైభవంగా' సినిమా రూపొందింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహించాడు. కేతిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రభు .. నరేశ్ .. అలీ .. సుబ్బరాజు .. నవీన్ చంద్ర .. శ్రీలక్ష్మి .. తులసి .. ప్రగతి ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. రిలీజ్ కి ముందే యూత్ లో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ నాగార్జున 'నిన్నే పెళ్లాడుతా' సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో వైజాగ్ లో మొదలవుతుంది. వైజాగ్ లో చంటి (నరేశ్) బలరామ్ (ప్రభు) చాలాకాలం నుంచి మంచి స్నేహితులుగా కొనసాగుతుంటారు. ఇద్దరి ఇళ్లు ఒకే కాలనీలో పక్క పక్కనే ఉంటాయి. చంటి భార్య (ప్రగతి) బలరామ్ భార్య (తులసి) ఇద్దరి డెలివరీ ఒకే రోజు ఒకే సమయంలో జరుగుతుంది. చంటి దంపతుల రెండవ సంతానంగా రుషి (వైష్ణవ్), బలరామ్ దంపతులకు మూడో సంతానంగా రాధ (కేతిక) జన్మిస్తారు. ఈ ఇద్దరే ఈ సినిమాలోని నాయకా నాయికలు.
రుషి - రాధ ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రేమించుకుంటారు. స్కూల్ లో జరిగిన ఒక సంఘటన కారణంగా ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం మానేస్తారు. పదేళ్ల తరువాత జరిగిన ఒక సంఘటన వలన ఇద్దరూ కూడా తమ బెట్టును గట్టున పెట్టేస్తారు. ఇక తమ వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవడమేనని అనుకుంటారు. కానీ ఈలోగా ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. రుషి అన్నయ్య బాలు .. రాధ అక్కయ్య ప్రేమలో పడటం, రాధ అన్నయ్య అర్జున్ (నవీన్ చంద్ర)కి తెలుస్తుంది. రాజకీయాలలో ఎదగాలనుకుంటున్న అర్జున్, బాలూని కొట్టడంతో రెండు కుటుంబాల మధ్య మాటలు ఆగిపోతాయి .. రాకపోకలు నిలిచిపోతాయి.
ముందుగా రాధ అక్కయ్యతో బాలు పెళ్లి జరగాలి .. ఆ తరువాత రాధతో తన పెళ్లి జరగాలని రుషి భావిస్తాడు. ఈ రెండు జంటల ప్రేమ .. పెళ్లివరకూ వెళ్లాలంటే, ముందుగా రెండు కుటుంబాలలోని పెద్దలను కలపాలని రుషి - రాధ నిర్ణయించుకుంటారు. తమ ప్రేమ విషయం బయటపడకుండా ఈ పనిని చక్కబెట్టాలి. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? వాళ్లు చేసే ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? ఈ రెండు జంటల ప్రేమకథ పెళ్లి పీటలవరకూ వెళుతుందా? అనేదే కథ.
కథ విషయానికి వస్తే .. ఇదేమీ కొత్త కథ కాదు. అద్భుతమైన కథనం కూడా లేదు. తరుణ్ హీరోగా చేసిన 'నువ్వేకావాలి' సినిమా మనకి ఎక్కువగా గుర్తుకు వస్తుంది. కమెడియన్ సత్యను ఆటపట్టించే మందు పార్టీ సీన్ చూస్తే, 'ఆనందం' సినిమాలో ఎమ్మెస్ కామెడీ ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది. ఇలా ఏదో ఒక సినిమాలోని సీన్స్ తగులుతుంటాయి. రొటీన్ గా అనిపించే కథే అయినా, బోర్ కొట్టకుండా చెప్పడంలో దర్శకుడు గిరీశాయ సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా కూడా చాలా సరదాగా .. సందడిగా నడుస్తుంది. ఇంటర్వెల్ కి పడే ఇంట్రెస్టింగ్ బ్యాంగుతో కథ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం అనిపిస్తుంది.
అయితే సెకండాఫ్ లో కొన్ని నాటకీయంగా అనిపించే సన్నివేశాల వలన, ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. ఆ సన్నివేశాలను పక్కన పెడితే ఫరవాలేదనిపించేలానే కథ ముందుకు వెళుతుంది. క్లైమాక్స్ లోను బరువైన ఎమోషన్స్ జోలికి వెళ్లకుండా దర్శకుడు తేలికగానే లాగించేశాడు. కథాకథనాల్లో కొత్తదనం లేకపోయినా, ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచినవి దేవిశ్రీ పాటలు .. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. 'తెలుసా .. తెలుసా' .. 'కొత్తగా లేదేంటి' .. 'సిరి సిరి సిరి మువ్వల్లో' పాటలు మనసును పట్టేసుకుంటాయి. 'కొత్తగా లేదేంటి' అనే రొమాంటిక్ సాంగ్ కి ఎక్కువ మార్కులు పడతాయి.
శ్యామ్ దత్ ఫొటోగ్రఫీ బాగుంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్ .. రెయిన్ ఎఫెక్ట్ సీన్స్ ను అద్భుతంగా ఆవిష్కరించాడు. 'కొత్తగా ఉందేంటి' పాటకి ఆయన చేసిన లైటింగ్ హైలైట్. వైష్ణవ్ ను .. కేతికను మరింత అందంగా చూపించాడు. నటన పరంగా వైష్ణవ్ తేజ్ .. కేతిక శర్మలలో, కేతిక శర్మకి ఎక్కువ మార్కులు పడతాయి. గ్లామరస్ గా మాత్రమే ఈ అమ్మాయి కనిపించగలదు అనుకున్నవారంతా ఈ సినిమా చూస్తే ఆశ్చర్యపోతారు. అంత చక్కని ఎక్స్ ప్రెషన్స్ ను ఆమె పలికించింది. వైష్ణవ్ తేజ్ లుక్ పరంగా ఓకే .. నటన పరంగా ఇంకా కొత్త పోవాలి. డాన్సు విషయంలోను కాస్త దృష్టి పెట్టాలి.
దర్శకుడు పాత్రలకి తగిన నటీనటులనే ఎంచుకున్నాడు. ప్రధానమైన పాత్రలను ఎక్కడ ఎంత వరకూ అవసరమో అంతవరకూ మాత్రమే వాడాడు. అయితే వైష్ణవ్ తేజ్ తో పవన్ మేనరిజమ్స్ చేయించడం .. చివరికీ టీవీలో కూడా పవన్ సినిమా వస్తున్నట్టుగా చూపించడం .. సరదాగా కూడా హీరో మెగాస్టార్ పాటలను హమ్ చేయడం ఫ్యాన్స్ కోసమే అనుకోవాలి.
బలమైన విలన్ లేకుండా .. పరిస్థితులనే విలన్ గా చూపిస్తూ గిరీశాయ కథను నడిపించాడు. ఎక్కడ ఏ మాత్రం వీలున్నా ఎంటర్టయిన్ మెంట్ ను జోడించే అవకాశాన్ని మాత్రం వదులుకోలేదు. హిట్ సినిమాల్లోని హైలైట్ సీన్స్ ను బుర్రలో పెట్టుకోకుండా .. వాటిని మళ్లీ టచ్ చేసే ప్రయత్నం చేయకుండా కొత్త కథను ఎంచుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుందంతే.
--- పెద్దింటి గోపీకృష్ణ