Edappadi Palaniswami: మద్రాస్ హైకోర్టులో పళనిస్వామికి ఊరట.. పన్నీర్ సెల్వంకు షాక్
- పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పళనిస్వామిని పార్టీ నేతగా ఎన్నుకున్న వైనం
- ఈ ఎన్నికను హైకోర్టులో సవాల్ చేసిన పన్నీర్ సెల్వం
- పళనిస్వామికి అనుకూలంగా తీర్పునిచ్చిన డివిజన్ బెంచ్
తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వంపై కొనసాగుతున్న వివాదానికి హైకోర్టు తెరదించింది. పళనిస్వామే అన్నాడీఎంకేకు నాయకుడని తీర్పును వెలువరించింది.
వివరాల్లోకి వెళ్తే... జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. దీంతో, సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ లో పళనిస్వామి సవాల్ చేశారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ పళనిస్వామికి అనుకూలంగా తీర్పును వెలువరించింది.
మరోవైపు హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే పళనిస్వామి మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.