New Delhi: పైలట్ల సమ్మె.. 800కుపైగా నిలిచిపోయిన లుఫ్తాన్సా విమానాలు

Delhi Airport Chaos Hundreds Stranded As Lufthansa Flights Cancelled

  • వేతనాల పెంపు కోరుతూ పైలట్ల సమ్మె
  • ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన లుఫ్తాన్సా విమానాలు
  • ఢిల్లీలో 700 మంది ప్రయాణికుల పడిగాపులు
  • 5 శాతం పెంచుతామన్న సంస్థ.. 5.5 శాతం కావాలంటున్న పైలట్లు

జర్మనీకి చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు చెందిన 800కుపైగా విమానాలు నిన్న నిలిచిపోయాయి. దీంతో లక్షమందికి పైగా ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. మెరుగైన వేతనాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పైలట్లు నిన్న ఒక్క రోజు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

పైలట్ల సమ్మె కారణంగా లుఫ్తాన్సా విమానాలు నిలిచిపోవడంతో నిన్న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 700 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. అలాగే, జర్మనీ నుంచి ఢిల్లీ చేరుకోవాల్సిన రెండు విమానాలు రద్దయ్యాయి. విమానాలు రద్దు కావడంతో టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఢిల్లీలోని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 

పైలట్ల సమ్మెకు వేతనాలే అసలు కారణం. సీనియర్ పైలట్లకు 5 శాతం, కొత్తగా ఈ పైలట్ ఉద్యోగాల్లో చేరిన వారికి 18 శాతం పెంచుతామని లుఫ్తానా హామీ ఇచ్చింది. అంటే  మొత్తంగా 900 యూరోలు (రూ. 72 వేలు) పెంచుతామని చెప్పింది. అయితే, ఈ ప్రతిపాదనకు పైలట్లు అంగీకరించడం లేదు. 5.5 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, వచ్చే ఏడాది ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంపు ఉండాలని, మరిన్ని సెలవులు కావాలని డిమాండ్ చేస్తూ పైలట్లు ఈ సమ్మె చేపట్టారు.

  • Loading...

More Telugu News