Nora Fatehi: సుఖేశ్ చంద్రశేఖర్ కేసులో.. నోరా ఫతేహిని ఆరు గంటల పాటు ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
- రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆమె నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం
- బీఎండబ్ల్యూ కారు తనకు సుఖేశ్ ఇవ్వలేదన్న ఫతేహి
- కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఫతేహి భార్య ఇచ్చినట్టు వెల్లడి
సుఖేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసులు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఆమెను సాక్షిగా భావించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ కేసును ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తోంది. గతేడాది పోలీసులు సుఖేశ్, అతడి భార్య లీనా మారియా పాల్ కు వ్యతిరేకంగా కోర్టులో చార్జ్ షీటు కూడా దాఖలు చేశారు.
ఫోర్టిస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్ అయిన శివిందర్ సింగ్ భార్య నుంచి రూ.200 కోట్లను సుఖేశ్ దోచుకున్నట్టు కేసు నడుస్తోంది. ఇలా దోచుకున్న సొమ్ముతో సుఖేశ్.. బాలీవుడ్ తారలైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహికి భారీ బహుమతులు కూడా ఇచ్చినట్టు తేలింది. అయితే, సుఖేశ్ తనకు బీఎండబ్ల్యూ కారును బహూకరించినట్టు వచ్చిన ఆరోపణలను ఫతేహి తోసిపుచ్చింది. చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైనందుకు సుఖేశ్ భార్య తనకు కారును ఇచ్చినట్టు చెప్పింది. ఈ కేసులో జాక్వెలిన్ కు వ్యతిరేకంగా ఈడీ చార్జ్ షీట్ ను దాఖలు చేయడం గమనార్హం.