Andhra Pradesh: ఏపీలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు రిపేర్‌లో ఉన్న మాట వాస్తవమే: మంత్రి అంబటి రాంబాబు
- సీఎంగా జగన్ పదవి చేపట్టాకే గేట్లు రిపేర్‌కు రాలేదన్న అంబటి
- ఐదారేళ్లుగా ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టలేదని వెల్లడి
- టీడీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణకు చిల్లిగవ్వ ఇవ్వలేదన్న మంత్రి
ఏపీలో సాగు నీటి ప్రాజక్టులకు సంబంధించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాజెక్టుల గేట్లు రిపేర్‌లోనే ఉన్నాయని చెప్పిన ఆయన... ఇది ముమ్మాటికీ వాస్తవమేనని తెలిపారు. ఈ మేరకు గుండ్లకమ్మ గేట్లు కూరుకుపోవడం వల్ల 700 క్యూసెక్కుల మేర నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయిన వైనంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన రాంబాబు పై వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు రిపేర్‌లో ఉన్న మాట వాస్తవమేనని, అవన్నీ ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి చేపట్టిన తర్వాతే రిపేర్‌లోకి రాలేదని తెలిపారు. ఐదారేళ్లుగా ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేశారని, టీడీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణ కోసం చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే అన్ని ప్రాజెక్టుల గేట్లు రిపేర్‌లో ఉన్నాయన్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల సేఫ్టీ పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి రాంబాబు తెలిపారు.