Hyderabad: అమిత్ షాకు అసదుద్దీన్ ఓవైసీ లేఖ‌... సెప్టెంబ‌ర్ 17 నాటి వేడుక‌ల ప్ర‌స్తావ‌న‌

asaduddin owaisi writes a letter to amit shah

  • సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినం నిర్వ‌హించాల‌న్న ఓవైసీ
  • తెలంగాణ విమోచ‌నం కోసం హిందువులు, ముస్లింలు క‌లిసి పోరాడార‌ని వెల్ల‌డి
  • 17న పాత‌బ‌స్తీలో తిరంగా యాత్ర‌, బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తామ‌న్న ఎంపీ
  • సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామ‌న్న మ‌జ్లిస్ అధినేత‌

మ‌జ్లిస్ పార్టీ అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ శ‌నివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఓ లేఖ రాశారు. ఆ లేఖ ప్ర‌తిని హైద‌రాబాద్‌లో మీడియాకు విడుద‌ల చేసిన ఓవైసీ.. ఆ లేఖ‌లో తాను ప్ర‌స్తావించిన అంశాల‌ను వెల్ల‌డించారు. సెప్టెంబ‌ర్ 17న జాతీయ స‌మైక్య‌తా దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తాను ఆ లేఖ‌లో అమిత్ షాను కోరిన‌ట్లు ఓవైసీ తెలిపారు. ఈ లేఖను అమిత్ షాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఓవైసీ పంపారు.

ఈ సంద‌ర్భంగా ఓవైసీ ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సెప్టెంబ‌ర్ 17న పాత‌బ‌స్తీలో తిరంగా యాత్ర‌తో పాటు బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌మ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజ‌ర‌వుతార‌న్న ఓవైసీ.. కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామ‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 17న హైద‌రాబాద్ సంస్థానం భార‌త దేశంలో విలీన‌మైంద‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ విమోచ‌నం కోసం హిందువులు, ముస్లింలు క‌లిసి పోరాటం సాగించార‌ని ఓవైసీ తెలిపారు.

  • Loading...

More Telugu News