Batteries: ఎండ్రకాయల డిప్పల రసాయనంతో సుస్థిర శక్తినిచ్చే బ్యాటరీలు
- మేరీల్యాండ్ వర్సిటీ ప్రొఫెసర్ల విశిష్ట పరిశోధన
- క్రస్టేషియన్ జీవుల డిప్పలలో చిటిన్ రసాయనం
- కర్పరాలను గట్టిగా మార్చే చిటిన్
- చిటిన్ శక్తిని అధికంగా నిల్వచేసుకోగలదన్న పరిశోధకులు
అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ విశిష్ట పరిశోధన చేపట్టారు. లోబ్ స్టర్లు, ఎండ్రకాయల వంటి సముద్ర జీవుల డిప్పల నుంచి సుస్థిర శక్తినిచ్చే బ్యాటరీలను అభివృద్ధి చేశారు. ఎండ్రకాయలపై ఉండే డిప్పల్లో ఓ రసాయన పదార్థాన్ని పరిశోధకులు గుర్తించారు. శక్తిని నిల్వచేయడంలో ఈ రసాయనం అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నట్టు వెల్లడైంది.
ఈ రసాయన పదార్థం పేరు చిటిన్. ఎండ్రకాయలు, రొయ్యలు వంటి క్రస్టేషియన్ జీవుల బాహ్య శరీర నిర్మాణంలో ఉండే కర్పరాలు ఈ చిటిన్ తోనే తయారవుతాయి. చిటిన్ సాయంతో ఈ పై డిప్పలు ఎంతో గట్టిగా రూపొందుతాయి. ఇప్పుడీ చిటిన్ ను బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ సరికొత్త బ్యాటరీలకు సంబంధించిన పరిశోధన వివరాలు 'మేటర్' అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం 'ఏ సస్టెయినబుల్ చిటోసాన్-జింక్ ఎలక్ట్రోలైట్ ఫర్ హై రేట్ జింక్-మెటల్ బ్యాటరీస్' అన్న శీర్షికతో ప్రచురితమైంది.
ఏదైనా ఒక ఎలక్ట్రానిక్, మెకానికల్ ఉత్పత్తికి బ్యాటరీ ఎంత ముఖ్యమో, అదే సమయంలో బ్యాటరీలోని పదార్థం ప్రకృతిలో సులభంగా విలీనమయ్యేలా ఉండడం, తద్వారా పర్యావరణంపై ప్రభావం చూపనిదై ఉండడం కూడా ముఖ్యమేనని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా, ఆ బ్యాటరీ వాణిజ్యపరంగా శక్తిమంతమైనది అయ్యుండాలని కూడా కోరుకున్నామని తెలిపారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయ లిథియం అయాన్ ఆధారిత బ్యాటరీలు ప్రకృతిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుందని, కొన్నిసార్లు వేల సంవత్సరాలు కూడా పట్టొచ్చని ఓ ప్రొఫెసర్ వివరించారు. పైగా ఈ బ్యాటరీలో కొన్నిసార్లు పేలతాయని, అగ్నిప్రమాదాలకు కారణమవుతాయని తెలిపారు. చిటిన్ తో తయారయ్యే బ్యాటరీలు పర్యావరణ హితమని పేర్కొన్నారు.