Nitish Kumar: విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే 2024లో బీజేపీ 50కి మించి సీట్లు గెలవలేదు: నితీశ్ కుమార్
- బీజేపీపై సమరశంఖం పూరించిన నితీశ్ కుమార్
- విపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తానని ఉద్ఘాటన
- ఢిల్లీలో పార్టీల అగ్రనేతలను కలుస్తానని వెల్లడి
బీజేపీ 2024 ఎన్నికల్లో 50 సీట్లకు మించి గెలుచుకోలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే, విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం సాగించినప్పుడే అది సాధ్యమని అన్నారు. ఈ దిశగా విపక్షాల మధ్య ఐక్యత కోసం తాను కృషి చేస్తున్నానని తెలిపారు.
ఇటీవలే బీహార్ లో బీజేపీతో భాగస్వామ్యానికి గుడ్ బై చెప్పి పాత నేస్తం ఆర్జేడీతో జట్టుకట్టిన నితీశ్ కుమార్ మరోసారి సీఎం పీఠం ఎక్కిన సంగతి తెలిసిందే. అవకాశం చిక్కినప్పుడల్లా ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు సంధిస్తున్నారు. తాజాగా జేడీయూ కార్యనిర్వాహక సమావేశంలో నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ వెళ్లి ఇతర పార్టీ అగ్రనేతలతో మాట్లాడతానని వెల్లడించారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు పాటుపడతానని తెలిపారు. నితీశ్ కుమార్ సోమవారం నుంచి మూడ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు.