Bengaluru: బెంగళూరును మరోసారి ముంచెత్తిన భారీ వర్షం
- గత రాత్రి బెంగళూరులో కుంభవృష్టి
- నగరం జలమయం
- సోమవారం సాయంత్రం కూడా భారీ వర్షపాతం నమోదు
- నగరంలో కనిపిస్తున్న వరద పరిస్థితులు
ఇప్పటికే భారీ వర్షాలతో జలాశయంలా మారిన బెంగళూరు నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. గత రాత్రి కురిసిన వర్షంతో నగరమంతా జలమయం కాగా, ఈ సాయంత్రం కురిసిన వర్షంతో వరద పరిస్థితులు కనిపించాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రధాన రహదారులపైనే ఇలా ఉంటే, లోతట్టు ప్రాంతాల్లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలను తరలించేందుకు బోట్లను ఉపయోగించాల్సి వస్తోంది. ఇప్పటికే బెంగళూరు నగరంలో విద్యాసంస్థలు మూసివేశారు. భారీ వర్షం ధాటికి ఎయిర్ పోర్టు ప్రయాణికుల లాంజ్ వరకు నీళ్లు వచ్చాయి.
కాగా, భారీ వర్షాలపై కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై స్పందించారు. టీకే హళ్లి పంప్ హౌస్ పొంగడంతో భారీగా వరద నీరు చేరిందని అన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కాగా, ఎండిపోయిన చెరువులపై ఓ పద్ధతి లేకుండా కడుతున్న నిర్మాణాల కారణంగానే కొద్దిపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయని నగరంలోని పలు కంపెనీలు విమర్శిస్తున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా నగర మౌలిక వసతుల అభివృద్ధి జరగడంలేదని ఆరోపించాయి.