Russia: కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడి.. నలుగురి మృతి

Two Russian embassy staff dead after suicide bomb blast in kabul
  • రాయబార కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ఉగ్రవాది ప్రయత్నం
  • కాల్చి చంపిన భద్రతా సిబ్బంది
  • 20 మందికి గాయాలు 
ఆప్ఘనిస్థాన్ మరోమారు రక్తమోడింది. బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు ఎంబసీ సిబ్బంది సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. రష్యా వీసాల కోసం కౌన్సెలింగ్ జరుగుతున్న కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. కౌన్సెలింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లేందుకు ఆత్మాహుతి బాంబర్ ప్రయత్నించాడు. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో భద్రతా సిబ్బంది అతడిని గేటు వద్దే ఆపేశారు. 

అయినప్పటికీ అతడు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఉగ్రవాది మరణించినా అతడి వద్దనున్న బాంబు భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు రాయబార కార్యాలయ సిబ్బంది సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ఈ దాడికి ఏ సంస్థా ఇప్పటి వరకు బాధ్యత ప్రకటించలేదు.
Russia
Afghanistan
Kabul
Bomb Blast

More Telugu News