Nitish Kumar: నితీశ్ జీ, ప్రధాని పోస్ట్ ఖాళీగా లేదు.. క్యూలో నించోవాల్సిందే: బీజేపీ సెటైర్
- ఎంతో మంది ప్రతిపక్ష నేతలు పోటీ పడుతున్నారన్న బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్
- రామ్ మనోహర్ లోహియాను అనుసరించే వ్యక్తిగా నేడు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్న
బీహార్ లో బీజేపీకి గుడ్ బై చెప్పి.. ఆర్జేడీ సహకారంతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మరో రెండేళ్ల పాటు సీఎం కుర్చీకి భరోసా కల్పించుకున్న నితీశ్ కుమార్.. ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టాలనేది ఆయన ప్రయత్నం. ఇందులో భాగంగా సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. దీంతో నితీశ్ కుమార్ నైతిక విలువలను బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
నితీశ్ కుమార్ తన వ్యక్తిగత ఆకాంక్షల మాదిరే బీహార్ అభివృద్ధికి చురుగ్గా పని చేస్తే బీహారీ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొదటిసారిగా పనిచేసిన రామ్ మనోహర్ లోహియా అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిగా నితీశ్ కుమార్ ను పేర్కొంటూ.. ‘‘నేడు మీరు ఎక్కడకు వెళ్లారు నితీశ్ జీ? నేడు ఏం చేస్తున్నారు? ప్రతి డోర్ ను తడుతున్నారు. ఇందులో కొత్తేమీ లేదు. మీకంటే ముందు చాలా మంది ఇదే పనిచేశారు. ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదు. ఎంతో మంది ప్రతిపక్ష నేతలు క్యూలో ఉన్నారు. మీరు కూడా నించోవాల్సిందే’’ అంటూ మంత్రి ప్రసాద్ ట్వీట్ చేశారు.