Team India: క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించిన భారత స్టార్​ ఆల్​రౌండర్​

Suresh rania announces retirement from all formats

  • అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చిన సురేశ్ రైనా
  • ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు చెప్పిన రైనా
  • ఐపీఎల్ లో రైనాను పట్టించుకోని ఫ్రాంచైజీలు

భారత వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని రైనా మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వన్డే, టీ20ల్లో మేటి ఆల్రౌండర్ గా ఎదిగిన 35 ఏళ్ల రైనా.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ తో పాటు చురుకైన ఫీల్డింగ్ తో చాలా మ్యాచుల్లో  భారత జట్టును గెలిపించాడు. రెండేళ్ల కిందట ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజే రైనా కూడా అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకున్నాడు. 

అయితే, ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు మాత్రం అందుబాటులో ఉన్నాడు. ధోనీతో పాటు చాన్నాళ్లు ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. అయితే, 2021 ఐపీఎల్ ప్రారంభానికి ముందు వ్యక్తిగత కారణాలతో అతను లీగ్ నుంచి వైదొలిగాడు. గత సీజన్ లో రైనాని చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మిగతా ఫ్రాంచైజీలు కూడా అతడిని జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. అటు దేశవాళీ క్రికెట్ లో సైతం అవకాశాలు రావడం లేదు. దాంతో, అన్ని ఫార్మాట్లకు దూరం కావాలని రైనా నిర్ణయం తీసుకున్నాడు.  

ఐపీఎల్‌ కెరీర్‌లో సురేశ్ రైనా 205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరుపున 226 వన్డేలు ఆడిన రైనా 5615 పరుగులు సాధించాడు. 78 టీ20 లు, 18 టెస్టుల్లో కూడా భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్‌గా 8 వేల పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన భారత తొలి ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు.

  • Loading...

More Telugu News